నూతన వ్యవసాయ చట్టాలు: కేంద్రం సహా నాలుగు రాష్ట్రాలకు ఎన్‌హెచ్ఆర్‌సీ నోటీసులు

By narsimha lodeFirst Published Sep 14, 2021, 3:32 PM IST
Highlights


నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాల నేతృత్వంలో రైతులు నిరసన కొనసాగిస్తున్నారు. ఈ విషయమై ఎన్‌హెచ్ఆర్‌సీ పలు రాష్ట్రాలతో పాటు కేంద్రానికి నోటీసులు జారీ చేసింది.

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ రైతు సంఘాల నేతృత్వంలో రైతుల నిరసన కొనసాగుతోంది.ఈ విషయమై జాతీయ మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీ,రాజస్థాన్, హర్యానా, యూపీ సహా కేంద్ర ప్రభుత్వానికి జాతీయ మానవహక్కుల సంఘం నోటీసులు జారీ చేసింది. ఈ ఆందోళనలు మానవ హక్కులకు విఘాతం కల్గిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.

 శాంతియుత పద్ధతుల్లో ఎవరికీ ఇబ్బంది లేకుండా చేసే ఆందోళనలు కమిషన్‌ గౌరవిస్తుందని తెలిపింది. కాగా, పారిశ్రామిక రంగంపై ఆందోళనల ప్రభావాన్ని ‘ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్‌ గ్రోత్‌’ లెక్కించి అక్టోబర్‌ 10 లోగా నివేదిక సమర్పించాలని ఆదేశించింది. అదే విధంగా కోవిడ్‌-19 ప్రోటోకాల్‌ ఉల్లంఘనల ప్రభావాన్ని జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ  కేంద్ర ఆరోగ్యశాఖ నివేదిక రూపంలో అందించాలని తెలిపింది.

గతంలో ఆందోళన జరిగే ప్రదేశం వద్ద మానవ హక్కుల కార్యకర్త గ్యాంగ్‌ రేప్‌కు గురైన ఘటనపై ఝజ్జర్‌ నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. రైతుల ఆందోళనల కారణంగా సాధారణ ప్రజా జీవనానికి, జీవనోపాధికి కల్గిన విఘాతంపై ‘ఢిల్లీ స్కూల్‌ ఆఫ్‌ సోషల్‌ వర్క్‌ (యూనివర్శిటీ ఆఫ్ ఢిల్లీ)అధ్యయనం చేసి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశాలను జారీచేసింది.  కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ 2020 నవంబర్ మాసం నుండి రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.


 

click me!