‘ఉపా’ కింద కేసు.. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్..

Published : Oct 04, 2023, 10:12 AM ISTUpdated : Oct 04, 2023, 10:14 AM IST
‘ఉపా’ కింద కేసు.. న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు ప్రబీర్ పుర్కాయస్థ అరెస్ట్..

సారాంశం

ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ ప్రబీర్ పుర్కాయస్థను ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

ఆన్‌లైన్ న్యూస్ పోర్టల్ న్యూస్‌క్లిక్ వ్యవస్థాపకుడు, జర్నలిస్ట్ ప్రబీర్ పుర్కాయస్థను ఉగ్రవాద నిరోధక చట్టం, చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. మంగళవారం న్యూస్‌క్లిక్‌ కార్యాలయం, దానితో అనుసంధానించబడిన దాదాపు 40 మంది జర్నలిస్టులు, ఇతర సిబ్బంది నివాసాలపై ఢిల్లీ పోలీసులు సోదాలు నిర్వహించిన అనంతరం ఈ పరిణామం చోటుచేసుకుంది. న్యూస్‌క్లిక్ పోర్టల్ హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.న్యూస్‌క్లిక్ సంస్థ కార్యాలయాన్ని కూడా సీజ్‌ చేశారు

ఫారిన్ కంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ (ఎఫ్‌సీఆర్‌ఏ)ని ఉల్లంఘించి న్యూస్‌క్లిక్ విదేశీ నిధులు పొందిందని ఆరోపణలు ఉన్నాయి. చైనీస్ ప్రచారాన్ని వ్యాప్తి చేయడానికి అమెరికన్ బిలియనీర్ నెవిల్లే రాయ్ సింఘమ్ నుంచి నిధులను పొందిన గ్లోబల్ నెట్‌వర్క్‌లో న్యూస్‌క్లిక్‌ అవుట్‌లెట్ భాగమని న్యూయార్క్ టైమ్స్ నివేదిక కూడా ఆరోపించింది. ఇక, న్యూస్‌క్లిక్‌పై ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం (ఉపా) కింద కేసు నమోదు చేసింది. 

ఈ పరిణామాల నేపథ్యంలో మంగళవారం తెల్లవారుజామున న్యూస్‌క్లిక్‌తో సంబంధం ఉన్న జర్నలిస్టుల ఇళ్లలో ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ సోదాలు నిర్వహించారు. ఢిల్లీతో పాటు ముంబైలోని పలు ప్రదేశాలలో సోదాలు జరిగాయి. సోదాల సందర్భంగా కొందరి నుంచి ల్యాప్‌టాప్‌లు, మొబైల్ ఫోన్‌లతో సహా ఎలక్ట్రానిక్ సాక్ష్యాలు, హార్డ్ డిస్క్‌లను ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల అనంతరం.. ప్రబీర్ పుర్కాయస్థ‌తో పాటు న్యూస్‌క్లిక్ పోర్టల్ హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని కూడా ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.

‘‘మొత్తం 37 మంది మగ అనుమానితులను ప్రశ్నించడం జరిగింది. 9 మంది మహిళా అనుమానితులను వారి సంబంధిత ప్రదేశాలలో ప్రశ్నించడం జరిగింది. డిజిటల్ పరికరాలు, డాక్యుమెంట్లు మొదలైనవాటిని స్వాధీనం చేసుకున్నారు. పరీక్ష కోసం వాటిని సేకరించారు. విచారణలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు ఇద్దరు నిందితులు.. ప్రబీర్ పుర్కాయస్థ, అమిత్ చక్రవర్తిలను అరెస్టు చేశారు’’అని ఢిల్లీ పోలీసు వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతోందని ఆ వర్గాలు పేర్కొన్నాయి. 

ఇక, చైనాతో లింకులు ఉన్నాయని ఆరోపించిన సంస్థల నుంచి న్యూస్‌క్లిక్‌కి దాదాపు రూ. 38 కోట్లు అందాయని.. ఆ నిధులను వెబ్‌సైట్‌లోని చైనా అనుకూల కంటెంట్‌ను ప్రభావితం చేయడానికి ఉపయోగించారని ఢిల్లీ పోలీసులు పేర్కొన్నారు. ఎగుమతి సేవలకు రుసుముగా రూ. 29 కోట్లు, షేర్ల ధరలను పెంచడం ద్వారా రూ. 9 కోట్లు ఎఫ్‌డిఐగా స్వీకరించినట్లు పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. ఈ నిధులను కార్యకర్తలు తీస్తా సెతల్వాద్, గౌతమ్ నవ్లాఖాతో కూడా పంచుకున్నారని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.

అయితే ఈ సోదాలపై ప్రతిపక్షాల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమైంది. కొంతమంది దీనిని పత్రికా స్వేచ్ఛపై అణిచివేత అని పేర్కొన్నారు. ఇక, ఈ సోదాలపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా స్పందించింది. సరైన ప్రక్రియను అనుసరించాలని.. ప్రెస్ బెదిరింపులకు సాధనాలుగా క్రూరమైన క్రిమినల్ చట్టాలను రూపొందించవద్దని కేంద్రాన్ని కోరింది. ఈ దాడులు మీడియాను మభ్యపెట్టే మరో ప్రయత్నం అని ఆందోళన వ్యక్తం  చేసింది.

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?