
నీట్ పీజీ-2021 ప్రవేశాల్లో (NEET admission) రిజర్వేషన్ల విషయంలో వార్షిక ఆదాయం రూ. 8 లక్షలు (₹8 lakh per annum income criteria) కన్నా తక్కువగా ఉన్నవారికి ఆర్థికంగా వెనకబడిన తరగతుల (Economically Weaker Section- EWS) వారిగా పరిగణించడంపై పునః సమీక్షిస్తామని కేంద్రం ప్రభుత్వం గురువారం సుప్రీం కోర్టుకు(Supreme Court) తెలియజేసింది. ఈ మేరకు జస్టిస్ డీవై చండ్రచూడ్, జస్టిస్ విక్రమ్ నాథ్‌లతో కూడిన ధర్మాసనానికి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వివరాలు తెలియజేశారు. ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేస్తుందని.. ఈ నివేదిక రావడానికి నాలుగు వారాల సమయం పడుతుందని చెప్పారు.
ఈడబ్ల్యూఎస్ కోటాపై నిర్ణయం తీసుకునే వరకు నీట్ కౌన్సెలింగ్‌ను మరో నాలుగు వారాల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం తరఫు కోర్టుకు హామీ ఇచ్చారు. గతంలో కోర్టుకు ఇచ్చిన హామీ మేరకు నీట్ (పీజీ) కౌన్సెలింగ్‌ను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకన్నట్టుగా తెలిపారు. ఈ వివరణపై స్పందించిన ధర్మాసనం నాలుగు వారాల్లో ఈడబ్ల్యూఎస్ కేటగిరి ప్రమాణాల పునః పరిశీలన విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. ఈ కేసు తదుపరి విచారణను సుప్రీం ధర్మాసనం.. 2022 జనవరి 6కు వాయిదా వేసింది.
నీట్ పీజీ-2021 ప్రవేశాల్లో.. ఆలిండియా కోటా (AIQ) కేటగిరీలో ఓబీసీలకు 27 శాతం కోటా, ఈడబ్ల్యూఎస్‌కి 10 శాతం రిజర్వేషన్లు ప్రకటిస్తూ కేంద్రం జూలై 29న నోటిఫికేషన్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే నీట్-పీజీ కోర్సుల్లో ఈడబ్ల్యూఎస్/ఓబీసీ కోటాను సవాల్ చేస్తూ పలువురు నీట్ అభ్యర్థులు సుప్రీం కోర్టులో పిటిషన్‌లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీం కోర్టు ఆ పిటిషన్లపై విచారణ చేపట్టింది.
వాస్తవానికి అక్టోబర్ 25 నుంచి నీట్ పీజీ కౌన్సిలింగ్ షెడ్యూల్ ప్రారంభమవుతుందని తొలుత ప్రకటించారు. అయితే నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కౌన్సెలింగ్‌ను ప్రారంభిస్తే కనుక విద్యార్థులు నష్టపోతారని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాటగిరీ రిజర్వేషన్ల అంశంపై తీర్పు వెలువరించే వరకు నీట్-పీజీ కౌన్సెలింగ్‌ను నిర్వహించబోమని కేంద్రం సుప్రీం కోర్టుకు హామీ ఇచ్చింది. దీంతో నీట్ పీజీ కౌన్సిలింగ్ నిలిచిపోయింది.