
24 స్థానాలకు జరిగిన బీహార్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో అధికార ఉన్న ఎన్డీయే అగ్రస్థానంలో నిలిచింది. 24 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎన్‌డీఏ 13 (బీజేపీ 7, జేడీయూ 5, ఆర్‌ఎల్‌జేపీ 1) గెలుచుకోగా, ఆర్జేడీ 6 సీట్లలో మాత్రమే విజయం సాధించింది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ చతికిలపడిపోయింది. ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేయగా కేవలం ఒక్క స్థానానికే పరిమితం అయ్యింది. నలుగురు స్వతంత్రులు కూడా విజయం సాధించగలిగారు.
24 లోకల్ అథారిటీ నియోజకవర్గాల్లో ఏప్రిల్ 4వ తేదీన బ్యాలెట్ పేపర్ పద్దతి ద్వారా ఈ ఓటింగ్ నిర్వహించారు. బీహార్ శాసన మండలిలో మొత్తం 75 స్థానాలను ఉన్నాయి. జులై 2021 నుండి అధికార వర్గానికి చెందిన మొత్తం 24 స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో శాసన మండలిలో ప్రస్తుతం వరకు 51 సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే ఈ ఖాళీలు భర్తీ చేసేందుకు నాలుగు రోజుల కింద ఎన్నికలు జరిగాయి. మొత్తం 24 స్థానాలకు గాను 187 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.
ఈ ఎన్నికల్లో RJD 6 స్థానాలు గెలుచుకొని JDUను వెనక్కి నెట్టేసింది. మొత్తంగా ఈ 24 స్థానాల్లో ఎన్‌డీఏ కూటమి నుంచి బీజేపీ - 7, జేడీయూ - 5, ఆర్‌ఎల్‌జేపీ 1 స్థానం గెలుచుకుంది. ప్రతిపక్ష ఆర్జేడీ 6, కాంగ్రెస్ ఒకటి, నాలుగు సీట్లు స్వతంత్రులు గెలుచుకున్నారు.
రాష్ట్రంలో శాసనమండలి ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ, జనతాదళ్ (యునైటెడ్), రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ పొత్తు పెట్టుకుని ఎన్డీఏ కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో బీజేపీ 12 మంది అభ్యర్థులను నిలబెట్టింది, జనతాదళ్ (యునైటెడ్) 11 మంది అభ్యర్థులను నిలబెట్టగా రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ ఒక్కరిని మాత్రమే నిలబెట్టింది.
బీహార్ ఎన్నికలలో కులం ఎల్లప్పుడూ ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ సంవత్సరం ఎన్నికలలో కూడా ఈ అంశం కీలకంగా వ్యవహరించింది. బీహార్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భూమిహార్, రాజ్‌పుత్ కులాలకు చెందిన అభ్యర్థులు అత్యధిక స్థానాల్లో విజయం సాధించారు. 24 స్థానాల్లో భూమిహార్ కులానికి చెందిన ఆరుగురు అభ్యర్థులు, రాజ్‌పుత్ కులానికి చెందిన ఆరుగురు అభ్యర్థులు గెలుపొందారు.
పాట్నా నుండి కార్తికేయ కుమార్ (RJD), గోపాల్‌గంజ్ నుండి రాజీవ్ కుమార్ (BJP), రాజీవ్ కుమార్ (కాంగ్రెస్) బెగుసరాయ్ వంటి గెలిచిన అభ్యర్థులు భూమిహార్ కులానికి చెందినవారే. అలాగే ఔరంగాబాద్, రోహ్తాస్, భాగల్పూర్, తూర్పు చంపారన్, సహర్సా, ముజఫర్‌పూర్‌లలో రాజ్‌పుత్ కులాల అభ్యర్థులు ప్రధానంగా విజయం సాధించారు.
వైశాలి, నవాడ, నలంద, మధుబని, గయాలో యాదవ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు విజయం సాధించారు. కాగా వైశ్య సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులు ఆరు జిల్లాల్లో విజయం సాధించారు. కాగా 24 స్థానాల్లో ఒక్క ముస్లిం, దళిత అభ్యర్థి కూడా గెలవలేదు. దాదాపు ఈ ఎన్నికల్లో 1.32 లక్షల మంది ఓటర్లు ఓటు వేశారు. ఈ ఎన్నికలకు సంబంధించిన ఫలితాలను గురువారం వెల్లడించారు.