ఎన్డీయే పక్షాల సమావేశం : మాది కాల పరీక్షలో నెగ్గిన కూటమి .. ఖర్గేకు కౌంటరిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ

Siva Kodati |  
Published : Jul 18, 2023, 07:58 PM ISTUpdated : Jul 18, 2023, 08:00 PM IST
ఎన్డీయే పక్షాల సమావేశం : మాది కాల పరీక్షలో నెగ్గిన కూటమి .. ఖర్గేకు కౌంటరిచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ

సారాంశం

ఎన్డీయే కూటమిపై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు ప్రధాని నరేంద్ర మోడీ. తమ కూటమి ఎన్నో పరీక్షలను దాటిందన్నారు. ఈ కూటమి మరింత పురోగమించాలని, దేశ, ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటోందన్నారు.

వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో దేశంలో రాజకీయాలు వేగంగా మారిపోతున్న సంగతి తెలిసిందే. మూడోసారి అధికారాన్ని అందుకోవాలని బీజేపీ, మోడీని గద్దె దించాలని విపక్షాలు భావిస్తున్నాయి. ఇన్నేళ్లలో ఎన్నడూ లేని విధంగా విపక్షాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. పాట్నా, బెంగళూరులలో విపక్షాలు సమావేశమై కార్యాచరణపై చర్చించాయి. మోడీకి ధీటైన నేతను ఉమ్మడి అభ్యర్ధిగా నిలబెట్టాలని భావిస్తున్నాయి. 

ఈ నేపథ్యంలో బీజేపీ కూడా బలప్రదర్శనకు సిద్ధమైంది. ఢిల్లీలోని అశోకా హోటల్‌లో ఎన్డీయే పక్షాల సమావేశానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి తన పాత మిత్రులను, ఏ కూటమిలో లేని పార్టీలను ఆహ్వానించింది. ప్రధాని మోడీ, జేపీ నడ్డాల నేతృత్వంలో ఈ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. తమ కూటమి ఎన్నో పరీక్షలను దాటిందన్నారు. రాబోయే రోజుల్లో మీరు (విపక్ష కూటమి) కఠిన సవాళ్లను ఎదుర్కోవచ్చని ప్రధాని చురకలంటించారు. 

ALso Read: విపక్షాల కూటమికి కొత్త పేరు ‘INDIA’ .. అర్ధం ఏంటంటే, మరి సారథి ఎవరు.. వివరాలివే..!!

అంతకుముందు బెంగళూరులో జరిగిన విపక్ష కూటమి సమావేశంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే బీజేపీని టార్గెట్ చేశారు. ఎన్డీయే కూటమిలోకి 30 రాజకీయ పార్టీలు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. బీజేపీ ఇప్పుడు చిన్న రాజకీయ పార్టీలతో చేతులు కలపాలని తహతహలాడుతోందని.. బీజేపీ అఖిల భారత అధ్యక్షుడు స్నేహితులను వెతుక్కుంటూ ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి పరిగెత్తారంటూ ఖర్గే సెటైర్లు వేశారు.

బీజేపీ తన కూటమి భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఖర్గే దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి రావడానికి మిత్రులను ఉపయోగించుకుందని, తర్వాత వారిని మరిచిపోయిందని ఎద్దేవా చేశారు. విపక్షాలకు బీజేపీ భయపడుతోందని.. అందుకే అత్యవసరంగా సమావేశం ఏర్పాటు చేశారని ఖర్గే విమర్శించారు. దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని కాపాడేందుకు ప్రతిపక్షాలు బెంగళూరులో సమావేశమయ్యాయని కాంగ్రెస్ అధ్యక్షుడు వాఖ్యానించారు. 

వ్యాఖ్యలపై ఎన్డీయే సమావేశంలో మోడీ కౌంటరిచ్చారు. ఎన్డీయే కాలపరీక్షలో ఉత్తీర్ణత సాధించిన కూటమి అన్నారు. ఈ కూటమి మరింత పురోగమించాలని, దేశ, ప్రాంతీయ ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుకుంటోందన్నారు. నేటి సమావేశానికి హాజరయ్యేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఎన్డీయే మిత్రపక్షాలు ఢిల్లీకి రావడం చాలా సంతోషించదగ్గ విషయమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మరోవైపు బెంగళూరులో జరుగుతున్న విపక్షాల భేటీపై అంతకుముందు కూడా ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విమర్శలు చేశారు.

అక్కడ కుటుంబం కోసం, కుటుంబం చేత, కుటుంబం కొరకు అనేది మంత్రంగా వున్న పచ్చి అవినీతిపరుల సదస్సు జరుగుతోందన్నారు. గడిచిన 9 ఏళ్లలో కొత్త సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులోకి తెచ్చామని ప్రధాని తెలిపారు. గతంలో స్వార్ధపూరిత రాజకీయాల కారణంగా అభివృద్ధి ఫలాలు మారుమూల ప్రాంతాలకు చేరడం సాధ్యం కాలేదని ప్రధాని గుర్తుచేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలకలం... ఇంటర్నేషనల్ విమానాలకు బాంబు బెదిరింపులు
ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?