పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌వికి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ రాజీనామా..

Published : Mar 16, 2022, 11:03 AM IST
పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్ష ప‌ద‌వికి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ రాజీనామా..

సారాంశం

పంజాబ్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ రాజీనామా చేశారు. కాంగ్రెస్ అధ్యక్షురాలి కోరిక మేరకు తాను తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన లేఖను పోస్ట్ చేశారు. 

ఇటీవ‌ల జ‌రిగిన ఐదు రాష్ట్రాల ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ (congress) ఘోర ప‌రాజ‌యం పాలైంది. అయితే దీనికి బాధ్య‌త వ‌హిస్తూ ఐదు రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధ్య‌క్షుల‌ను తొల‌గించాల‌ని సోనియా గాంధీ (Sonia Gandhi) నిర్ణ‌యించిన మ‌రుస‌టి రోజే ఆ పార్టీ పంజాబ్‌ చీఫ్‌ నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ ( Navjot Singh Sidhu) ఈరోజు తన పదవికి రాజీనామా చేశారు.

ఈ మేర‌కు నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ బుధ‌వారం త‌న ట్విట్ట‌ర్ (twitter) అకౌంట్ ద్వారా ఈ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించారు. ‘‘కాంగ్రెస్ అధ్యక్షురాలి కోరిక మేర‌కు నేను నా రాజీనామాను పంపాను ’’ అని సోనియా గాంధీని ఉద్దేశించి తన లేఖ కాపీని ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. 

 

రాష్ట్ర కాంగ్రెస్ యూనిట్ల పునర్వ్యవస్థీకరణను సులభతరం చేసేందుకే రాజీనామాలు కోరినట్లు కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా (Randeep Surjewala) మంగ‌ళ‌వారం ట్వీట్ చేశారు. ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh), ఉత్తరాఖండ్ (Uttarakhand), పంజాబ్ (Punjab), గోవా (Goa), మణిపూర్ (Manipur) పీసీసీ అధ్యక్షులను పీసీసీ పునర్వ్యవస్థీకరణకు వీలుగా రాజీనామాలు చేయాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కోరార‌ని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. 

 

పంజాబ్ లో కాంగ్రెస్ ఓట‌మి పాలైన త‌రువాత నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ మొద‌టి సారిగా మీడియాతో మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) ని అధికారంలోకి తీసుకురావడం ద్వారా పంజాబ్ ప్ర‌జ‌లు అద్భుతమైన నిర్ణయం తీసుకున్నార‌ని ప్రశంసించారు. ఈ విష‌యాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎలా చెపుతున్నారని మీడియా అడిగిన ప్రశ్నకు జ‌వాబిస్తూ.. ప్రజలు మార్పును ఎంచుకున్నారని, వారు ఎన్నటికీ తప్పు చేయరని ఆయన చెప్పారు. ‘‘ ప్రజల గొంతు దేవుడి స్వరం. దానిని మనం వినయంతో అర్థం చేసుకోవాలి. దానికి నమస్కరించాలి ’’ అని నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ అన్నారు

పంజాబ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో భీక‌ర బహుముఖ పోరు ఉంటుంద‌ని మొద‌ట్లో అంద‌రూ భావించినా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఏక‌చ‌క్రాధిప‌త్యం చెలాయించింది. రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం 117 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా ఇందులో 92 స్థానాలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీకి కేవ‌లం పంజాబ్ లో 18 స్థానాలు వ‌చ్చాయి. 2017 ఎన్నిక‌లతో పోలిస్తే కాంగ్రెస్ ఈ ఎన్నిక‌ల్లో తీవ్రంగా క్షీణించింది. కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్య‌ర్థి చరణ్‌జిత్ సింగ్ చన్నీ (Charanjit Singh Channi) కూడా ఆయ‌న పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు.

కాంగ్రెస్ చీఫ్ గా ఉన్న నవజ్యోత్‌సింగ్‌ సిద్ధూ కూడా అమృత్‌సర్ ఈస్ట్ (Amritsar East) స్థానంలో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అభ్య‌ర్థి జీవన్‌జ్యోత్ కౌర్ చేతిలో 6,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. సిద్దూకు 32,929 ఓట్లు రాగా, ఎమ్మెల్యే కౌర్‌కు 39,520 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ముఖ్య స్థానాల్లో ఉన్న మంత్రులు, నాయ‌కులు కూడా ఆప్ ప్ర‌భంజ‌నం ముందు త‌ట్టుకోలేక‌పోయారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?