వైద్య ప‌రిశోధ‌న‌ల కోసం న‌వీన్ శేఖ‌ర‌ప్ప మృత‌దేహం.. మ‌రో రెండు రోజుల్లో బెంగళూరుకు రాక‌..

Published : Mar 19, 2022, 08:43 AM IST
వైద్య ప‌రిశోధ‌న‌ల కోసం న‌వీన్ శేఖ‌ర‌ప్ప మృత‌దేహం.. మ‌రో రెండు రోజుల్లో బెంగళూరుకు రాక‌..

సారాంశం

రష్యా షెల్లింగ్ వల్ల ఉక్రెయిన్ లో మరణించిన వైద్య విద్యార్థి నవీన్ శేఖరప్ప మృత‌దేహాన్ని వైద్య పరిశోధనల కోసం అందించాలని తల్లిదండ్రులు నిర్ణయించారు. ఈ నెల 21వ తేదీన మృత‌దేహం కర్ణాటకకు రానుంది. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర సీఎం స్పష్టం చేశారు. 

ఉక్రెయిన్‌లో షెల్లింగ్‌లో మరణించిన భారతీయ విద్యార్థి నవీన్ శేఖరప్ప మృతదేహం సోమవారం (మార్చి 21) బెంగళూరుకు చేరుకుంటుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పష్టం చేశారు. అయితే ఆయ‌న మృత‌దేహం ఆదివారమే రాష్ట్రానికి వ‌స్తుంద‌ని సీఎం గ‌తంలో ట్వీట్ చేశారు. దానిని ఇప్పుడు స‌రి చేశారు. న‌వీన్ శేఖ‌ర‌ప్ప మృత‌దేహం ఇక్క‌డికి రాగానే వైద్య ప‌రిశోధ‌న‌ల కోసం అందించ‌నున్నారు. దీనికి త‌ల్లిదండ్రులు అంగీకారం తెలిపారు. 

‘‘ఉక్రెయిన్‌పై రష్యా దాడి సంద‌ర్భంగా షెల్లింగ్ లో ఇటీవల మరణించిన హవేరీ జిల్లాకు చెందిన యువకుడు నవీన్ జ్ఞానగౌడర్ మృతదేహం సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు బెంగళూరుకు చేరుకుంటుంది’’ అని బొమ్మై ట్వీట్ చేశారు.

ఎవ‌రీ నవీన్ శేఖరప్ప ?
ఉక్రెయిన్‌లో మరణించిన నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ 21 ఏళ్ల ఎంబీబీఎస్ విద్యార్థి. ఆయ‌న కర్ణాటకలోని హవేరీ జిల్లా నివాసి. ఖార్కివ్ నేషనల్ మెడికల్ యూనివర్శిటీకి లో వైద్య విద్య‌ను అభ్య‌సిస్తున్నారు. అయితే ర‌ష్యా ఉక్రెయిన్ పై భీక‌ర దాడులు చేస్తున్న స‌మ‌యంలో న‌వీన్ ఆహారం కొనుక్కోవడానికి క్యూలో నిలబడి ఉన్నారు. అయితే ఆ కాల్పుల్లో స్టూడెంట్ మృతి చెందాడు. ఆయ‌న మృతి ప‌ట్ల భార‌త్ మొత్తం ఒక్క‌సారిగా ద్రిగ్భాంతికి గుర‌య్యింది. అక్క‌డ చిక్కుకున్న విద్యార్థులు కూడా తీవ్ర ఆందోళ‌న చెందారు. కాగా క‌ర్ణాట‌క సీఎం న‌వీన్ శేఖరప్ప కుటుంబానికి సీఎం బసవరాజ్ బొమ్మై రూ.25 లక్షల చెక్కును అంద‌జేశారు. బాధిత కుటుంబంలో ఒక‌రికి ఉద్యోగం ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. 

అయితే నవీన్ శేఖరప్ప జ్ఞానగౌడర్ మృతదేహాన్ని రాష్ట్రంలోని వైద్య కళాశాలకు దానం చేయాలని ఆయన కుటుంబం నిర్ణయించింది. ఈ మేర‌కు మృతుడి తండ్రి శేఖ‌ర‌ప్ప శుక్ర‌వారం మాట్లాడుతూ.. తన కుమారుడి మృతదేహాన్ని తీసుకొచ్చే ప్రక్రియ ఆలస్యమవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ఆయన దేహాన్ని చివరిసారిగా చూడగలమని తెలియగానే ఆ దుఃఖం తొలగిపోయింద‌ని అన్నారు. అంత్యక్రియలు నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని దావణగెరెలోని ఎస్‌ఎస్‌ మెడికల్‌ కాలేజీకి దానం చేయాలని కుటుంబసభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు.

ఇదిలా ఉండ‌గా ఉక్రెయిన్ పై ర‌ష్యా దాడి చేస్తూనే ఉంది. ఉక్రెయిన్ పై విచ‌క్ష‌ణ ర‌హితంగా బాంబుల వ‌ర్షం కురిపిస్తున్నాయి. ఇప్పటికే పలు ప్ర‌ధాన ప‌ట్ట‌ణాలు స్మశానదిబ్బలుగా మారాయి. త‌మ న‌గ‌రాల‌ను కాపాడుకోవడాని ఉక్రెయిన్ సైన్యం కూడా వీరోచితంగా పోరాటం సాగిస్తున్నాయి. ర‌ష్యాన్ సేన‌ల‌కు దీటుగా  ప్రతి ఘటనను కనబరుస్తున్నాయి. కాగా ర‌ష్యా దాడిని ప్ర‌పంచ దేశాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. ఉక్రెయిన్ కు పరోక్షంగా సహకారం అందిస్తున్నాయి. జెలెన్ స్కీ సైన్యానికి మ‌ద్ద‌తుగా నిలిచాయి. ఇప్పటికే ప్రపంచ దేశాలు ర‌ష్యా యుద్దాన్మోదాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. అయినప్ప‌టీకి.. పుతిన్ తన దాష్టీక చ‌ర్య‌ల‌ను ఆప‌డం లేదు. 

ర‌ష్యా దాడి వ‌ల్ల ఉక్రెయిన్ లోని కీవ్, మరియూపోల్,ఖర్కివ్, ఖేర్సన్, ఇర్ఫిన్ ను లోనిపలు భవనాలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు బాంబుల దాడులకు ధ్వంస మయ్యాయి. ఐక్య‌రాజ్య‌స‌మితి నివేదికల ప్ర‌కారం.. దాదాపు.. 30 లక్షల మంది వరకు ఉక్రెయిన్ ను విడిచి పొరుగు దేశాల‌కు వెళ్ళిపోయారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి దాదాపు 6.5 మిలియన్ల మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. మ‌న దేశ పౌరులు కూడా అక్క‌డ చిక్కుకుపోయారు. అయితే వారిని భార‌త్ ఆప‌రేష‌న్ గంగా అనే ప్ర‌త్యేక మిష‌న్ చేప‌ట్టి ఇండియాకు తీసుకొచ్చింది. దాదాపు 20 వేల మందిని సుర‌క్షితంగా ఉక్రెయిన్ నుంచి తీసుకొచ్చామ‌ని ఇటీవ‌ల ప్ర‌భుత్వం పార్ల‌మెంట్ లో ప్ర‌క‌టించింది. 

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu