
National Voter Day 2022: భారతదేశంలో ప్రతి ఏడాది జనవరి 25న జాతీయ ఓటరు దినోత్సవాన్ని(Voter day) నిర్వహిస్తారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మనది. ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓటుకు తనదైన ప్రాముఖ్యత ఉంది. ప్రతి ఐదేళ్లకు ఒకసారి ప్రజా ప్రతినిధులను ప్రజలే స్వయంగా ఎన్నుకుంటారు. అందుకే దేశంలో ఓటరుకు ఓ ప్రత్యేక స్థానం ఉంది. ప్రతి పౌరుడు తన ఓటు హక్కుతో.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగల సామర్థ్యం ఉంది. నచ్చకపోతే పదవిలో నుంచి దింపేయగలరు. ఎంతో విలువైన ఈ ఓటు ప్రజాస్వామ్యంలో వజ్రాయుధం వంటింది. 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటు అనే బ్రహ్మాస్త్రం. భారత రాజ్యాంగం కల్పించిన ఓ గొప్ప వరం. ఎంతో విలువైన ఓటు హక్కును అందరికీ కల్పించేందుకు గాను ఏటా కేంద్ర ఎన్నికల సంఘం విస్తృతంగా ప్రచారం చేస్తూ.. ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపడుతోంది.
భారత ఎన్నికల సంఘం.. 25 జనవరి 1950న స్థాపించారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం ఎన్నికల సంఘం స్థాపన రోజున జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఓటర్ల దినోత్సవం రోజున, దేశవ్యాప్తంగా అన్ని పోలింగ్ బూత్ ప్రాంతాల్లో ఓటర్లకు ఓటుపై అవగాహన కల్పించేందుకు 18 ఏళ్లు నిండిన యువకులను గుర్తించి గుర్తింపు కార్డులను అందజేసి ప్రతి సంవత్సరం ఓటర్లను ఓటు వేయమని ఎన్నికల సంఘం ప్రోత్సహిస్తుంది. ఈ రోజున, ఓటర్లు కూడా ఓటు వేస్తామని ప్రమాణం చేయిస్తారు. తద్వారా వారు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడం గురించి పౌరులుగా తెలుసుకుంటారు. ప్రతి పౌరుడి ఓటు నవ భారతాన్ని నిర్మిస్తుంది. భారతదేశం పురోగతి మరియు అభివృద్ధి ఓటర్ల ఓటు ద్వారా నిర్ణయించడం జరుగుతుంది.
2011 జనవరి 25న ‘జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని’ అప్పటి రాష్ట్రపతి ప్రతిభా దేవి పాటిల్ ప్రారంభించారు. 1950లో ఈ రోజున ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేసినందున దీనిని జనవరి 25న జరుపుకుంటారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 12వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకోనుంది. ప్రతి సంవత్సరం ఓటరు దినోత్సవం సందర్భంగా ఒక థీమ్‌ని ఉంచుతారు. ఈ సంవత్సరం థీమ్(ఓటర్ డే థీమ్) . ‘ఎన్నికలు కలుపుకొని, ప్రాప్యత, పాల్గొనేలా చేయడం’.
జాతీయ ఓటర్ల దినోత్సవం.. సందర్భంగా యువతను ఉద్దేశిస్తూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడంలో ఎన్నికల ప్రక్రియ చాలా కీలకమైనది. అందుకే యువత బాధ్యతాయుతంగా ఓటు వేయడాన్ని మన కర్తవ్యంగా పరిగణించాలి. ఓటు హక్కును వినియోగించుకునేందుకు యువత ముందుకు రావాలని కోరారు. ఎందుకంటే మన దేశ భవిష్యత్తును నిర్ణయించడంలో ప్రతి ఒక్క ఓటు కూడా ముఖ్యమైనది. జాతీయ ఓటర్ల దినోత్సవం అని ఎంపీ విజయసాయిరెడ్డి అభిప్రాయపడ్డారు.
ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో నేడు రాష్ట్ర, జిల్లా,బూత్ స్థాయిల్లో 12వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను నిర్వహించబోతున్నారు. రాష్ట్ర స్థాయిలో ఉ.11.30గం.లకు అమరావతి సచివాలయం 5వ బ్లాకు కలక్టర్ల సమావేశ మందిరంలో 12వ జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి(సిఇఓ)కె.విజయానంద్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ ఆన్లైన్(వెబ్ నార్) ద్వారా పాల్గొని జాతీయ ఓటర్ల దినోత్సవ ప్రాముఖ్యత గురించి ప్రసంగించనున్నారు.
అదేలాఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజయవాడ రాజ్ భవన్ నుండి ఆన్లైన్ వెబ్ నార్ ద్వారా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొని అందరితో ప్రతిజ్ణ చేయించనున్నారు. రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి కె.విజయానంద్ రాష్ట్ర స్థాయిలో జాతీయ ఓటర్ల దినోత్సవ విజేతలకు సర్టిఫికెట్లు, బహుమతులను అందిస్తారు.