ప్రధాని నరేంద్ర మోడీ కులం గురించి అబద్ధం చెప్పారని, ఆయన పుట్టుకతో ఓబీసీ వర్గానికి చెందని వ్యక్తి కాదంటూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. దీనిపై జాతీయ బీసీ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రధాని నరేంద్ర మోడీ కులాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారత్ న్యాయ యాత్రలో భాగంగా ఒడిషాలో ఆయన పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ ప్రసంగిస్తూ.. మోడీ కులం గురించి అబద్ధం చెప్పారని, ఆయన పుట్టుకతో ఓబీసీ వర్గానికి చెందని వ్యక్తి కాదన్నారు. దీనిపై జాతీయ బీసీ కమీషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బీసీ సామాజిక వర్గాలకు రాహుల్ గాంధీ తక్షణం క్షమాపణలు చెప్పాలని సూచించింది. ఈ మేరకు కమీషన్ ఓ ప్రకటన విడుదల చేసింది.
‘‘ ప్రధాని మోడీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో భారతదేశంలోని కోట్లాది మంది ఓబీసీ ప్రజలు ఆయనపై ఆగ్రహంతో వున్నారు. రాహుల్ గాంధీ తన బహిరంగ సభలలో ఒకదానిలో మోడీ ఓబీసీ హోదా, ప్రధాని జాతి గురించి వ్యాఖ్యలు చేశారు. ఓబీసీ జాబితాలో 'మోద్ ఘంచి'ని చేర్చాలనే నోటిఫికేషన్‌ను గుజరాత్ ప్రభుత్వం 25 జూలై 1994న విడుదల చేసింది. అంతకు ముందు, గుజరాత్‌లో ఒక సర్వే తర్వాత మండల్ కమిషన్ కూడా ఇండెక్స్ 91(A) ప్రకారం OBCల జాబితాను సిద్ధం చేసింది. అందులో మోద్-ఘంచి కులాన్ని చేర్చారు ’’.
‘‘ గుజరాత్ రాష్ట్రంలోని OBCల సెంట్రల్ లిస్ట్‌లో ‘మోద్-ఘంచి’ కులంతో సహా 104 కులాలు/కమ్యూనిటీలు ఉన్నాయి. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ 15.11.1997న గుజరాత్ రాష్ట్రం, గెజిట్ కోసం OBCల సెంట్రల్ లిస్ట్‌లో మోద్-ఘంచిని చేర్చడానికి కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది. ఇందుకోసం 27.10.1999న నోటిఫికేషన్ జారీ చేయబడింది. గుజరాత్ రాష్ట్ర OBCల సెంట్రల్ లిస్ట్‌లో మోద్-ఘంచిని చేర్చడానికి వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ సలహా సాధారణంగా కేంద్ర ప్రభుత్వానికి కట్టుబడి ఉంటుంది ’’.
‘‘ ఈ రెండు నిర్ణయాలూ తీసుకున్నప్పుడు నరేంద్ర మోదీ .. శాసన లేదా కార్యనిర్వాహక పదవిని కలిగి లేరని గమనించాలి. రాహుల్ గాంధీకి తన పూర్వీకుల నుంచి సంక్రమించిన ఓబీసీల పట్ల ఉన్న ద్వేషం చూస్తే భయంకరంగా ఉంది. పార్లమెంటు వేదికపై ప్రధాని మోదీ పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ రిజర్వేషన్ వ్యతిరేక వైఖరిని బట్టబయలు చేశారు. మండల్ కమీషన్‌ను వ్యతిరేకిస్తూ పార్లమెంటు వేదికపై రాజీవ్ గాంధీ చేసిన వ్యాఖ్యల గురించి అందరికీ తెలిసిందే. సోనియా గాంధీ, రాహుల్ గాంధీల నేతృత్వంలోని కాంగ్రెస్ జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించాలని కోరుకోలేదు. మోడీ ప్రభుత్వం వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్‌కు ప్రభుత్వం రాజ్యాంగ హోదా కల్పించింది.’’
రాహుల్ గాంధీ ఏమన్నారంటే :
ప్రధాని మోడీ.. గుజరాత్‌లోని ‘‘ తెలి ’’ కులంలో జన్మించారని.. దీనిని 2000వ సంవత్సరంలో దీనిని ప్రభుత్వం జనరల్ విభాగం నుంచి ఓబీసీ కేటగిరీలోకి మార్చిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఓబీసీ కుటుంబంలో జన్మించలేదు కాబట్టే ప్రధాని మోడీ.. తన జీవితాంతం కులగణనను అంగీకరించరని రాహుల్ ఎద్దేవా చేశారు. అయితే ఆ వెంటనే రాహుల్ తన వ్యాఖ్యలను సవరించారు. మోడీ ‘‘తెలి’’లో కాదని.. ‘‘ఘాంచీ’’ కులంలో పుట్టారని రాహుల్ దుయ్యబట్టారు.
‘‘ ఈరోజు కాంగ్రెస్ , రాహుల్ గాంధీలు కోట్లాది మంది ఓబీసీలను అవమానపరుస్తూ విభజనకు బీజం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి చిల్లర రాజకీయాలను ఖండిస్తూ.. కోట్లాది మంది ఓబీసీ సోదర సోదరీమణులు క్షమాపణలు చెప్పాలి ’’ అంటూ జాతీయ బీసీ కమీషన్ ప్రకటనలో పేర్కొంది.