త్వరలో మోడీ మంత్రివర్గ విస్తరణ: పరిశీలనలో ఉన్న పేర్లు ఇవే...

By telugu teamFirst Published Jul 2, 2021, 8:12 AM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని ఒకటి, రెండు రోజుల్లో విస్తరిస్తారనే ప్రచారం సాగుతోంది. వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల ఎన్నికలను, 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని అంటున్నారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ త్వరలో తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది జరిగే ఐదు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలను, 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయన మంత్రివర్గాన్ని విస్తరించాలని భావిస్తున్నారు. రెండోసారి ప్రధాన మంత్రి పదవిని చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరించడం ఇదే తొలిసారి. 

ఒకటి, రెండు రోజుల్లో మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారని అంటున్నారు. కాంగ్రెసు నుంచి బిజెపిలోకి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియాకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. జ్యోతిరాదిత్య చేరికతో మధ్యప్రదేశ్ లో బిజెపి తిరిగి అధికారాన్ని చేజిక్కించుకుంది. అదే విధంగా అస్సాంలో హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి సహకరించిన సర్బందా సోనోవాల్ కు కూడా కేంద్ర మంత్రివర్గంలో మోడీ చోటు కల్పిస్తారని అంటున్నారు. 

లోక్ జనశక్తి పార్టీ (ఎల్జేపీ)ని చీల్చిన చిరాగ్ పాశ్వాని మామ పశుపతి పరాశ్ కు మోడీ మంత్రివర్గంలో చోటు కల్పిస్తారని అంటున్నారు. చిరాగ్ పాశ్వాన్ తండ్రి రామ్ విలాస్ పాశ్వాన్ మరణంతో ఖాళీ అయిన క్యాబినెట్ బెర్త్ ను పశుపతి పరాశ్ కు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. 

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ యునైటెడ్ కేంద్ర మంత్రివర్గంలో చేరుతుందా, లేదా అనే విషయంపై ఇంకా స్పష్టత లేదు. కేంద్రంలో జేడీయుకి ఒక్క మంత్రి పదవి ఇవ్వడానికి మోడీ ముందుకు వచ్చారు. అయితే, నితీష్ కుమార్ దాన్ని తిరస్కరించి, మంత్రివర్గంలో చేరలేదు. అయితే జేడీయుకు రెండు మంత్రి పదవులను ఇవ్వజూపుతున్నట్లు సమాచారం. జేడీయూ నేతలు లల్లన్ సింగ్, రామ్ నాథ్ ఠాకూర్ లకు కేంద్రంలో మంత్రి పదవులు దక్కే అవకాశం ఉంది.

బీహార్ నేత సుశీల్ మోడీ, మహారాష్ట్ర నేత నారాయణ రాణే, భూపేంద్ర యాదవ్ ప్రధాని మోడీ మంత్రివర్గంలో చేరుతారని ప్రచారం జరుగుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ నెల రోజులుగా మంత్రివర్గ విస్తరణపై కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుత మంత్రుల పనితీరును కూడా సమీక్షించారు. 

వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి మంత్రివర్గ విస్తరణలో ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. వరుణ్ గాంధీ, రామశకంర్ కథేరియా, అనిల్ జైన్, రీటా బహుగుణ, జాఫర్ ఇస్లామ్ లను మోడీ కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకుంటారని భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో బిజెపి మిత్రపక్షం అప్నాదళ్ కు చెందిన అనుప్రియ పటేల్ కు మంత్రి పదవి దక్కుతుందని భావిస్తున్నారు.

ఉత్తరాఖండ్ నుంచి అజయ్ భట్ గానీ అనిల్ బలూనీ గానీ మోడీ మంత్రివర్గంలో చేరే అవకాశం ఉంది. కర్ణాటక నుంచి ప్రతాప్ సింహాకు మంత్రివర్గంలో స్థానం కల్పిస్తారు. పశ్చిమ బెంగాల్ నుంచి జగన్నాథ్ సర్కార్, శంతను ఠాకూర్, నిథీట్ ప్రామాణిక్ పేర్లు వినిపిస్తున్నాయి.

బ్రిజేంద్ర సింగ్ (హర్యానా), రాహుల్ కస్వాన్ (రాజస్థాన్), అశ్విి వైష్ణవ్ (ఒడిశా), పూనమ్ మహాజన్ లేదా ప్రీతమ్ ముండే (మహారాష్ట్ర), పర్వేష్ వర్మ లేదా మీనాక్షి లేఖి (ఢిల్లీ) పేర్లు కూడా మంత్రివర్గంలో చేరే అవకాశాలున్నవారి జాబితాలో చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. మొత్తం 37 మందితో మోడీ తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే ప్రచారం జరుగుతోంది.

click me!