కరోనా వ్యాక్సిన్ విషయంలో నరేంద్ర మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రాలకు కరోనా వ్యాక్సిన్ ను ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకుంది.
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కీలకమైన నిర్ణయం తీసుకుంది. కరోనా వ్యాక్సిన్ ను రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను రాష్ట్రాలకు ఉచితంగా సరఫరా చేస్తామని చెప్పింది.
కేంద్ర ప్రబుత్వ నిర్ణయంతో రాష్ట్రాలకు కొంత మేరకు ఊరట లభించే అవకాశం ఉంది. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్ల వయస్సు పైబడినవారందరికీ వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. వ్యాక్సిన్ ఖర్చులను రాష్ట్రాలే భరించాలని కేంద్రం ఇంతకు ముందు ప్రకటించింది.
undefined
మే 1 నుంచి ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, కేరళ వంటి రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయి. ఈ స్థితిలో కేంద్రం ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ను అందించడం వల్ల రాష్ట్రాలకు కొంత మేరకు ఊరట లభించనుంది.
అయితే, వ్యాక్సిన్లు ధరలు రాష్ట్రాలకు ఒక్కటి, కేంద్రానికి మరోటా అనే ప్రశ్నలను రాష్ట్రాలు సంధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించాలని కేంద్రం నిర్ణయించినట్లు భావిస్తున్నారు.
భారత్ లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న రెండు టీకాలను రూ.150 చొప్పున వెచ్చించి కొనుగోలు చేస్తున్నామని, ఆ టీకాలను రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తున్నామని, ఇకపై కూడా అది కొనసాగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ట్వీట్ చేసింది.