రాహుల్ తో దోస్తీ: చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మోడీ

By pratap reddyFirst Published Dec 24, 2018, 6:32 AM IST
Highlights

ఆ పార్టీలకు సైద్ధాంతిక సారూప్యత లేదని, వ్యక్తిగతంగా ఉనికి నిలబెట్టుకోవడానికి చేతులు కలుపుతున్నాయని మోడీ అన్నారు. ఆదివారం తమిళనాడులోని చెన్నై సెంట్రల్‌, చెన్నై నార్త్‌, మదురై, తిరుచిరాపల్లి, తిరువళ్లూరు నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 

చెన్నై:  కాంగ్రెసుతో తెలుగుదేశం పార్టీ చేతులు కలపడంపై ప్రధాని నరేంద్ర మోడీ నిప్పులు చెరిగారు. ప్రతిపక్షాలు ప్రతిపాదించిన మహాకూటమి అపవిత్ర కూటమి అని ఆయన విమర్శించారు. రాజకీయ ఉనికి కోసం కొన్ని సంపన్న రాజకీయ కుటుంబాలు జట్టుకట్టాయని అన్నారు. 

ఆ పార్టీలకు సైద్ధాంతిక సారూప్యత లేదని, వ్యక్తిగతంగా ఉనికి నిలబెట్టుకోవడానికి చేతులు కలుపుతున్నాయని మోడీ అన్నారు. ఆదివారం తమిళనాడులోని చెన్నై సెంట్రల్‌, చెన్నై నార్త్‌, మదురై, తిరుచిరాపల్లి, తిరువళ్లూరు నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. 

ఆనాడు సొంత పార్టీకి చెందిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి (టి.అంజయ్య)ని కాంగ్రెస్‌ అవమానించిందని, ఫలితంగా తెలుగువారి ఆత్మగౌరవం కోసం స్వర్గీయ ఎన్టీఆర్‌ టీడీపీని స్థాపించారని, అలాంటి పార్టీ ఇప్పుడు కాంగ్రెస్ తో చేతులు కలపాలనుకుంటోందని, ఆ రాష్ట్ర ప్రజలు దీన్నెలా అంగీకరిస్తారని మోడీ అన్నారు.
 
మహాకూటమిలోని కొన్ని పార్టీలు సామాజికవేత్త రాంమనోహర్‌ లోహియా వారసులమని చెప్పుకొంటున్నాయని అంటూ లోహియా కాంగ్రెస్ను, దాని సిద్ధాంతాలను వ్యతిరేకించేవారని మోడీ గుర్తు చేశారు. మహాకూటమికి సైద్ధాంతిక నిబద్ధత లేదని అన్నారు. అధికారం కోసం మాత్రమే కూటమిని ఏర్పాటు చేశారు తప్ప ప్రజల కోసం కాదని ఆయన అన్నారు. 

కాంగ్రెస్‌ ఏ పార్టీనీ వదల్లేదని, 1980లో తమిళనాట ఎంజీఆర్‌ ప్రభుత్వాన్ని రద్దుచేసిందని అన్నారు. కాంగ్రెస్‌, డీఎంకేలకు పరస్పరం పొసగదని అంటూ జైన్‌ కమిషన్‌ నివేదికపై వివాదాన్ని గుర్తుచేశారు. ఇప్పుడీ రెండు పార్టీలూ ఒకే కూటమిలో ఉన్నాయని, ఇది అవకాశవాదం కాక మరేమిటని ఆయన అన్నారు.
 
వామపక్షాలు కాంగ్రెస్ ను సామ్రాజ్యవాద పార్టీ అని, వ్యవసాయ సంక్షోభానికి అదే కారణమంటూ ఎన్నో తీర్మానాలు చేశాయని, ఇప్పుడవి పొగడ్తలు కురిపించుకుంటున్నాయని అన్నారు. శరద్‌ పవార్‌ నేతృత్వంలోని ఎన్‌సీపీ కూడా కాంగ్రెస్‌ నాయకత్వాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఏర్పడిందేనని అన్నారు. 

click me!