
తమిళనాడులోని నమక్కల్‌లో జిల్లాలోని ఓ రెస్టారెంట్‌లో ఫుడ్ పాయిజన్ జరిగింది. చికెన్ షావర్మా తిని ఫుడ్ పాయిజన్‌తో బాధపడుతున్న 14 ఏళ్ల బాలిక సోమవారం మృతిచెందింది. ఇదే రెస్టారెంట్‌లో మాంసాహారం తిన్న మరో 11 మంది వైద్య విద్యార్థులు అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక, మొత్తంగా బాలిక కుటుంబ సభ్యులతో సహా శుక్రవారం, శనివారాల్లో రెస్టారెంట్‌లో భోజనం చేసిన 43 మందికి పైగా ఆసుపత్రి పాలైనట్లు కలెక్టర్ ఎస్ ఉమ తెలిపారు.
రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. నమక్కల్ మున్సిపాలిటీలో నివాసం ఉంటున్న విద్యార్థిని టి కలైఅరసి తన తల్లిదండ్రులు తవకుమార్, టి సుజాత సోదరుడు టి బూపతి, బంధువులు చినరాజ్, కవితతో కలిసి హోటల్‌కు వెళ్లింది. వారు ఫ్రైడ్ రైస్, షావర్మా, ఇతర వంటకాలను తిన్నారు. ఏఎస్ పేటైలోని తమ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత కలైఅరసి వాంతులు చేసుకోవడం ప్రారంభించింది. ఆమెకు జ్వరం, తల తిరగడం, విరేచనాలు కూడా ఉన్నాయి. ఆదివారం ఆమెను ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ఔట్ పేషెంట్‌గా చికిత్స పొందింది. అయితే ఆస్పత్రి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత సోమవారం ఇంట్లోనే కలైఅరసి మృతిచెందింది. అనంతరం బాలిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నమక్కల్ మెడికల్ కాలేజీ ఆస్పత్రికి తరలించారు.
ఇక, శని, ఆదివారాల్లో ఆ హోటల్‌లో ఆహారం తిన్న 200 మందిలో 43 మంది ప్రభావితమైనట్లుగా అధికారులు గుర్తించారు. ఐదుగురు చిన్నారులు, ఒక గర్భిణి సహా 43 మందికి ఇప్పటి వరకు ఫుడ్ పాయిజన్ అయినట్టుగా గుర్తించినట్టుగా కలెక్టర్ ఎస్ ఉమ తెలిపారు. మాంసం చెడిపోయినట్లు కనిపించనప్పటికీ.. మేము స్టాక్‌ను నమూనాలను సేలంలోని FSSAI ల్యాబ్‌లకు పంపామని చెప్పారు. అయితే మాంసం ఎక్కడి నుంచి సరఫరా చేయబడిందనే దానిపై కూడా దృష్టి సారించినట్టుగా చెప్పారు. స్థానిక పౌల్ట్రీ ఫారమ్‌ను తనిఖీ చేసినట్టుగా వెల్లడించారు.
ఈ ఘటన తర్వాత స్థానిక అధికారులు రెస్టారెంట్‌ను సీలు చేశారు. రెస్టారెంట్ యజమాని నవీన్ కుమార్‌తో సహా ముగ్గురిని అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది