Ayodhya: రామ మందిరంలో ప్రతిష్టించే రామ విగ్రహం ఎవరు చెక్కారు? ఎలా ఉన్నది?

By Mahesh K  |  First Published Jan 1, 2024, 6:00 PM IST

అయోధ్య రామ మందిరం గర్భగృహంలో జనవరి 22వ తేదీన ప్రతిష్టింపనున్న విగ్రహాన్ని ఎంపిక చేశారు. పోటీ పడిన మూడు విగ్రహాల్లో మైసూరుకు చెందిన అరుణ్ యోగిరాజ్ మలిచిన రామ్ లల్లా విగ్రహం ఎంపికైంది. ఆ విగ్రహం ఎలా ఉన్నదో రామజన్మ భూమి ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ స్వయంగా వెల్లడించారు.
 


Ram Temple: దేశమంతా ఎదరుచూస్తున్న ఓ ఘట్టం ముగిసింది. అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మాణం అవుతున్న మందిరంలో బాలరాముడి విగ్రహ ఎంపిక పూర్తయింది. మొత్తం మూడు విగ్రహాల్లో ఒకదాన్ని ఓటింగ్ ద్వారా ఎన్నుకన్నారు. ఈ ఓటింగ్‌లో మైసూరులో చెక్కిన రామ విగ్రహాన్ని ఎన్నుకున్నారు. ఎన్నికైన, ఈ నెల 22వ తేదీన అయోధ్య రామ మందిర గర్భగృహంలో ప్రతిష్టింపజేయనున్న ఆ విగ్రహాన్ని ప్రముఖ శిల్పి అరుణ్ యోగిరాజ్ మలిచారు.

ఈ విగ్రహాన్ని కర్ణాటక మైసూరు జిల్లా హోచ్‌డీ కోటే తాలూకాలోని బుజ్జెగౌడనపుర గ్రామంలో క్రిష్ణ రాతిని ఉపయోగించారు. అరుణ్ యోగి రాజ్ సారథ్యంలోని బృందం విగ్రహం రూపొందించింది. ఈ రామ్ లల్లా విగ్రహం 51 ఇంచుల ఎత్తు ఉంటుంది. మొత్తం బేస్‌తో కొలిస్తే.. ఎనిమిది అడుగుల ఎత్తు, మూడు అడుగుల వెడల్పు ఉంటుంది. ఎంపిక ప్రక్రియ కేవలం శిల్ప కళనే కాదు.. ఆ విగ్రహానికి ఉన్న దివ్యత్వాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నారు.

Latest Videos

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్ మాట్లాడుతూ.. ‘రామ మందిరంలో ప్రతిష్టించడానికి విగ్రహాన్ని ఎంచుకోవడంపై ఇటీవలే ఓ సమావేశం నిర్వహించాం. విగ్రహం కోసం ముగ్గురు ప్రముఖ శిల్పులు పోటీ పడ్డారు. ఒకరు రాజస్తాన్, మరొకరు బెంగళూరు, ఇంకొకరు మైసూరు నుంచి పోటీ పడ్డారు. మొత్తం మూడు విగ్రహాలను చెక్కారు. మైసూరు నుంచి అరుణ్ యోగిరాజ్, బెంగళూరు నుంచి కేఎల్ భట్ బాల రాముడి విగ్రహం కోసం నలుపు రంగును ఎంచుకున్నారు. ఇప్పుడు ఎంపికైన విగ్రహం.. ఐదేళ్ల బాలరాముడి రూపాన్ని అద్భుతంగా చిత్రిస్తున్నది’ అని వివరించారు.

Also Read : Free Bus: ఏపీ ఎన్నికల పై ‘ మహిళలకు ఉచిత ప్రయాణం ’ ప్రభావం ఎంత ?

‘ఆ బాలరాముడి కళ్లు కమలం పూరేకులను పోలి ఉన్నాయి. ఆయన ముఖం చంద్రుడి వలే ప్రకాశిస్తున్నది. ఆ పెదవులపై నిర్మలమైన మందహాసం ఉన్నది. ఆ బాలరాముడి చేతులు పొడుగ్గా ఉండి చూపుతిప్పుకోనివ్వడం లేదు’ అని చంపత్ రాయ్ తెలిపారు.

అరుణ్ యోగిరాజ్ తాను మలిచిన విగ్రహం ఎంపిక కావడంపై హర్షం వ్యక్తం చేశారు. తాను చెక్కిన రామ్ లల్లా విగ్రహం ఎంపిక కావడం తన అదృష్టం అని తెలిపారు. ఇది తన కెరీర్‌లోనే ముఖ్యమైన ప్రాజెక్ట్ అని చెప్పారు. ఈ విగ్రహాన్ని రూపొందించడానికి వారు పడిన శ్రమను, ప్రక్రియను ఆయన పంచుకున్నారు. ఇది తన కెరీర్‌లో గొప్ప మైలురాయి అని వివరించారు.

click me!