మిస్టరీ వ్యాధి.. రాజస్తాన్‌లో ఏడుగురు చిన్నారులు మృతి.. రంగంలోకి ఆరోగ్య మంత్రిత్వ శాఖ

Published : Apr 15, 2022, 07:54 PM IST
మిస్టరీ వ్యాధి.. రాజస్తాన్‌లో ఏడుగురు చిన్నారులు మృతి.. రంగంలోకి ఆరోగ్య మంత్రిత్వ శాఖ

సారాంశం

మిస్టరీ వ్యాధితో రాజస్తాన్‌లో ఏడుగురు చిన్నారులు మరణించారు. స్థానికంగా తయారు చేసి విక్రయించే ఓ కూల్ డ్రింక్ తాగి తర్వాతి రోజే జ్వరం బారిన పడి మరణించినట్టు తల్లిదండ్రులు చెప్పారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ రంగంలోకి దిగింది. అయితే, వారి మరణాలకు కూల్ డ్రింక్ కారణం కాదని, వైరల్ ఇన్ఫెక్షన్ మూలంగా మరణించినట్టు వైద్య నిపుణులు నిర్దారించారు.  

జైపూర్: ఎవరికి ఏ జబ్బు వచ్చినా అందరూ భయపడే పరిస్థితులు ఇవి. ఎవరికి ఏ వ్యాధి వచ్చినా.. ఇంకొకరికి సోకదనే గ్యారంటీ లేని రోజులు. అందుకే ఊరిలో ఎవరికి ఏ వైరస్ అని తేలినా.. మూకుమ్మడిగా వణికిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాజస్తాన్‌లో ఓ మిస్టరీ వ్యాధి రాష్ట్రాన్ని వణికించింది. దెబ్బకు రాష్ట్రస్థాయి వరకు ఆరోగ్య శాఖ నిపుణులు ఆ ఊరికి రాకతప్పలేదు. 

రాజస్తాన్‌లోని సిరోహి గ్రామానికి చెందిన ఏడుగురు పిల్లలు స్థానికంగా తయారు చేసిన ఓ కూల్ డ్రింక్ తాగి ఉదయాన్నే తీవ్రంగా జబ్బు పడ్డారు. బ్లాక్ స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు ఆరోగ్య శాఖకు చెందిన వైద్యులు అక్కడికి చేరుకున్నారు. వారి మరణానికి గల స్పష్టమైన కారణాలు ఏమిటో కనుగొనే పనిలో పడ్డారు.

మృతి చెందిన బాలల తల్లిదండ్రులను వైద్యాధికారులు ప్రశ్నించారు. ఏం తిన్నారని అడగ్గా.. క్రితం రోజు వారు స్థానికంగా తయారు చేసి విక్రయించే డ్రింక్‌ను తాగారని తెలిపారు. వారు చెప్పిన దాని ప్రకారం, ఆ స్థానిక కూల్ డ్రింక్ కారణంగా మరణించి ఉంటారనే అవగాహనకు వచ్చారు. దీంతో వైద్య అధికారులు ఆ కల్ డ్రింక్ శాంపిల్స్ కూడా తీసుకున్నారు. ఆ గ్రామంలోని అన్ని షాపుల్లో లభించే ఆ కూల్ డ్రింక్‌ను పరిశీలించారు. దీనిపై స్పష్టమైన నిర్ణయం వెలువడే వరకు ఆ కూల్ డ్రింక్‌ను విక్రయించరాదని ఆదేశించారు.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది. దీంతో ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రసాది లాల్ మీనా స్పందించారు. ఈ ఘటనపై వైద్య నిపుణులు దర్యాప్తు చేశారని వివరించారు. ఆ ఏడుగురు చిన్నారుల మరణానికి వైరల్ ఇన్ఫెక్షన్ కారణం అని తేలినట్టు వెల్లడించారు. అంతేకానీ, వారు తాగిన కూల్ డ్రింక్ వల్ల కాదని తేల్చినట్టు వివరించారు. తాను ఆ జిల్లా కలెక్టర్‌తో మాట్లాడానని, ఏడుగురు చిన్నారులు మరణించినట్టు తెలిసిందని ఆరోగ్య శాఖ మంత్రి ప్రసాది లాల్ మీనా వివరించారు. అయితే, వారు వైరల్
కారణంగానే మరణించారని తెలిపారు. ఆ ఊరి మొత్తం సర్వే చేపట్టామని, ప్రస్తుతం పరిస్థితి అదుపులోకి వచ్చిందని వివరించారు. జైపూర్, జోద్‌పూర్‌ల నుంచి ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకున్నాయని తెలిపారు. ఆ పిల్లలు వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగానే మరణించినట్టు రుజువు అయిందని, ఆ పిల్లల హిస్టరీ వేరుగా ఉన్నట్టు తేలిందని పేర్కొన్నారు.

PREV
click me!

Recommended Stories

ఏఐ ఉద్యోగాలను తగ్గించదు.. పెంచుతుంది : యోగి ఆసక్తికర కామెంట్స్
Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు