
న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో అనేకం కొత్త సరదా వీడియోలు వస్తుంటాయి. వైరల్ అవుతుంటాయి. కొన్ని సార్లు ఫన్నీగా లేకున్నా.. భీతి గొల్పుతున్నా చక్కర్లు కొడుతుంటాయి. ఇంకొన్ని నమ్మలేనట్టుగానే జరిగిన ఘటనలూ ఈ జాబితాలో ఉంటాయి. మూడో కోవకు చెందినదే ఈ వీడియో. కుత కుత మంటూ ట్రైన్ వస్తుంటే వాతావరణం గంభీరంగా మారిపోతుంది. ఒక రకమైన అలర్ట్‌నెస్ ఆటోమేటిక్‌గానే వచ్చేస్తుంది. అలాంటిది.. ఓ యువతి తన పై నుంచి ట్రైన్ వెళ్లిపోయినా పట్టనట్టుగా వ్యవహరించింది. ట్రైన్ వెళ్లిపోయాక
ఏమీ పట్టనట్టు.. అసలు ఏమీ జరగనట్టుగానే లేచి ట్రాక్ పై కూర్చుంది. వెంటనే ఫోన్ తీసి చెవి దగ్గర పెట్టి ముచ్చట్లో మునిగింది. ట్రాక్ పై నుంచి సింపుల్‌గా లేచి పక్కకు నడుచుకుంటూ వచ్చింది. ఈ వీడియో నెటిజన్లను టెన్షన్‌లో ముంచెత్తింది. మరికొందరిని తీవ్ర ఆగ్రహంలోకి నెట్టింది.
ఈ వీడియోను ఐపీఎస్ అధికారి దీపాంషు కాబ్రా ట్విట్టర్‌లో పోస్టు చేశారు. పోస్టు చేసిన మూడు రోజుల్లోనే లక్షకు పైగా వ్యూస్ సంపాదించుకుంది. ‘ఫోన్‌లో గాసిప్‌లు మాట్లాడటం ఎక్కువ ముఖ్యం’ అంటూ ఆ వీడియోకు కామెంట్ జోడించారు.
ఈ భయానక వీడియో ట్రైన్ వెళ్తుండగా మొదలవుతుంది. రైల్వే స్టేషన్ నుంచి ట్రైన్ క్రాస్ అయ్యాక.. అంటే.. కెమెరా ఫ్రేమ్ నుంచి ట్రైన్ వెళ్లిపోయాక ట్రాక్‌పై ఓ మహిళ కనిపిస్తుంది. తల చుట్టూ ఓ బ్లూ కలర్ స్కార్ఫ్ చుట్టుకుని ఉన్న ఆమె ఉన్నది. ట్రైన్ వెళ్లిపోయాక పడుకుని ఉన్న ఆమె లేచి కూర్చుంది. ఆ ట్రాక్‌పై కూర్చునే ఆమె ఫోన్‌కు వచ్చిన కాల్‌ను లిఫ్ట్ చేసింది. ఆ తర్వాత ఫోన్ మాట్లాడుతూ సింపుల్‌గా ట్రాక్ పై నుంచి నడుచుకుంటూ బయటకు వచ్చింది.
ఈ వీడియో నెటిజన్లను షాక్‌కు గురి చేసింది. ఆ ట్రైన్‌లో కింది వైపు వేలాడేవి ఏవీ లేకపోవడం ఆమె అదృష్టం అని ఒకరు కామెంట్ చేశారు. లేదంటే ఆమె ముక్కలైపోయేవారని తెలిపారు. ఆమెకు గ్యాలంట్రీ అవార్డును చెంప చెల్లుమనిపించే రూపంలో ఇవ్వాలని ఇంకొక నెటిజన్ రాసుకొచ్చారు. ఇంకొందరైతే ఆమెను అరెస్టు చేయాలని ప్రధాని మోడీ కార్యాలయానికి ట్యాగ్ చేశారు.