ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రెటరీ జనరల్ డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీం అల్ ఇసా ఐదు రోజుల పాటు భారత్‌లో పర్యటించనున్నారు. జూన్ 10వ తేదీన ఆయన ఇండియాకు వస్తారు. ఆ వెంటనే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్‌ను కలుస్తారు.
న్యూఢిల్లీ: ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రెటరీ జనరల్, ముస్లిం ప్రపంచానికి ప్రీతిపాత్రుడైన డాక్టర్ మొహమ్మద్ బిన్ అబ్దుల్ కరీం అల్ ఇసా ఈ నెల 10వ తేదీన భారత్‌కు రానున్నారు. మన దేశంలో ఐదు రోజులు పర్యటించనున్నారు. ఆయన భారత్‌లో అడుగు పెట్టిన తర్వాత జాతీయ భద్రత సలహాదారు అజిత్ దోవల్‌తో ముఖాముఖిగా సమావేశం అవుతారు.
జులై 11వ తేదీన ఉదయం 11 గంటలకు ఆయన ఢిల్లీలోని ఇండియా ఇస్లామిక్ కల్చరల్ సెంటర్‌లో మత పెద్దలు, విద్యావేత్తలు, మీడియా ప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమాన్ని ఖుస్రో ఫౌండేషన్ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో డాక్టర్ అల్ ఇసా.. ఎన్‌ఎస్ఏ అజిత్ దోవల్‌తో వేదిక పంచుకుంటారు.
సౌదీ అరేబియాలో కుటుంబం, మహిళలకు సంబంధించి ఆయన న్యాయ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చట్టాల సంస్కరణలు జరిగాయి. ఇందులో ఆయన పాత్ర కీలకంగా ఉన్నది. ఢిల్లీలో ఆయన ఇస్లాంను ఆధునీకరించడం, నాగరికతల గురించి మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. మత సహనం, భిన్న సంస్కృతుల మధ్య అనుసంధానం, అహింస, మత బహుళత్వం వంటి అంశాలపై చర్చిస్తారు.
ముస్లిం ప్రపంచం ఎదుర్కొంటున్న అనేక విమర్శలపై డాక్టర్ ఇసా అభిప్రాయానికి ఆదరణ ఉన్నది. అందుకే ఆయన కార్యక్రమానికి హాజరు కావడానికి పలు యూనివర్సిటీల నుంచి సీనియర్ అకడమిక్స్‌లు ఉత్సాహం చూపిస్తున్నారు.
Also Read: రాహుల్ గాంధీకి చుక్కెదురు: పరువు నష్టం కేసులో సూరత్ ట్రయల్ కోర్టు తీర్పుపై స్టేకి నిరాకరణ
డాక్టర్ అల్ ఇసా భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, మైనార్టీ వ్యవహారాల మంత్రి స్మృతి ఇరానీతో సమావేశం కాబోతున్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతోనూ భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఐసీసీఆర్ ప్రెసిడెంట్, పలు మతాలకు చెందిన గ్రూపులను ఆయన వివేకానంద్ ఇంటర్నేషనల్ ఫౌండేషన్‌లో కలుస్తారు. ఢిల్లీలో ఆయన అక్షరధామ్ ఆలయం సందర్శించి పలువురు ప్రముఖులను కలిసే అవకాశం ఉన్నది. ఢిల్లీలో ఉన్నప్పుడే ఆయన జామా మసీదుకు వెళ్లి శుక్రవారం ప్రార్థనల్లో పాల్గొంటారు. ఆగ్రాకు వెళ్లి తాజ్ మహల్ వంటి పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. అదే విధంగా నేషనల్ పోలీసు మెమోరియల్‌ను సందర్శించి అమరులకు నివాళి అర్పిస్తారు.
ఇస్లాంను ఆధునీకరించి, మతాంతర చర్చలు, ప్రపంచ శాంతికి ప్రాముఖ్యతనిస్తున్న ముఖ్యమైన గళం, సుప్రసిద్ధ ఇస్లామిక్ స్కాలర్ డాక్టర్ అల్ ఇసాకు మత పెద్దలు, ప్రభుత్వ అధికారులు, అంతర్జాతీయ సంస్థలూ మద్దతు ఇస్తుంటాయి.