పవిత్రమైన గంగా నదిపై క్రూయిజ్ పేరుతో బార్ నడిపిస్తున్నారు: బీజేపీ పై అఖిలేశ్ యాదవ్ తీవ్ర విమర్శలు

By Mahesh KFirst Published Jan 15, 2023, 1:16 PM IST
Highlights

పవిత్రమైన గంగా నదిపై బీజేపీ బార్ నడిపిస్తున్నదని సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ విమర్శలు చేశారు. ఆ ఎంవీ విలాస్ గంగా క్రూయిజ్ ఇది వరకే ఉన్నదని, దానికి కొన్ని హంగులు చేర్చి కొత్తగా ప్రారంభిస్తున్నారని ఆరోపణలు చేశారు. కొత్తగా చేర్చిన వాటిలో బార్ కూడా ఉన్నదని పేర్కొన్నారు. తాను ఇంకా ఆ క్రూయిజ్ ఎక్కలేదని, అయితే, అందులో బార్ ఉన్నదా? లేదా? అనే విషయాన్ని బీజేపీనే చెప్పాలని డిమాండ్ చేశారు.
 

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో ఎంవీ గంగా విలాస్ రివర్ క్రూయిజ్‌ను ప్రధాని మోడీ ప్రారంభించిన తర్వాతి రోజే ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ బీజేపీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇది వరకే ఉన్నవాటిని తమవిగా చెప్పుకోవడం, వాటిని మళ్లీ ప్రారంభించడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. ఎంవీ గంగా విలాస్ క్రూయిజ్ ఇది వరకే గంగా నదిలో సేవలు అందిస్తున్నదని అన్నారు. అయితే, బీజేపీ కొత్తగా ఆ రివర్ క్రూయిజ్‌లో బార్ చేర్చిందని ఆరోపించారు. పవిత్రమైన గంగా నది పై బీజేపీ ఇప్పుడు క్రూయిజ్ పేరిట బార్ నడిపిస్తున్నదని పేర్కొన్నారు. అయితే, తాను ఈ క్రూయిజ్ ఎక్కలేదని, ఆ విషయాన్ని బీజేపీనే ధ్రువీకరించాలని విమర్శలు చేశారు.

రాయ్‌బరేలీలో మీడియాతో ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ మాట్లాడుతూ, ‘ఈ రివర్ క్రూయిజ్ చాలా సంవత్సరాలుగా నడుస్తున్నది. ఇది కొత్తదేమీ కాదు. ఇది గత 17 సంవత్సరాలుగా నడుస్తున్నదని ఒకరు నాకు చెప్పారు. అయితే, బీజేపీ ఇప్పుడు కొత్తగా దానికి కొన్ని హంగులు అద్దింది. ఆ తర్వాత ఇప్పుడు దాన్ని మేం ప్రారంభించామని చెప్పుకుంటున్నారు. ప్రచారంలో, అబద్ధాలు చెప్పడంలో బీజేపీ చాలా ముందు ఉంటుంది. ఇప్పుడు పవిత్ర గంగా నదిలో ఈదుతున్నది కేవలం ఒక క్రూయిజ్ మాత్రమే కాదు. ఇప్పుడు అందులో ఆల్కహాల్ అందించే బార్ కూడా ఉన్నది’ అని అన్నారు.

Also Read: విలాసవంతమైన గంగా విలాస్ క్రూయిజ్, టెంట్ సిటీని ప్రారంభించిన ప్రధాని మోడీ.. వీటి విశేషాలేమిటంటే ?

‘మొన్న మొన్నటి వరకు గంగా మాత పై మేం పూజలు, మంత్రోచ్ఛరణలు వినేవాళ్లం. అక్కడ కూర్చున్నప్పుడు పవిత్రమైన, ఆధ్యాత్మిక విషయాలనే వినేవాళ్లం. గంగా నదిలో బోట్ ఎక్కేటప్పుడు అది మతపరమైన ప్రాంతం కాబట్టి ఏం చేయాలి? ఏం చేయకూడదు? అనే విషయాలను సూచించేవారు. కానీ, ఇప్పుడు రివర్ క్రూయిజ్‌లో బార్ ఉన్నదని చెబుతున్నారు. మేం ఇంకా ఆ క్రూయిజ్‌లోకి వెళ్లలేదు. అందులో బార్ ఉన్నదా? లేదా? అనే విషయాన్ని బీజేపీనే స్వయంగా చెప్పాలి’ అని డిమాండ్ చేశారు.

click me!