చైనా, పాక్ లకు హెచ్చరికలు.. సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం: ఆర్మీ చీఫ్

By Mahesh RajamoniFirst Published Jan 15, 2023, 12:42 PM IST
Highlights

Bengaluru: చైనా సరిహద్దుల్లో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే అన్నారు. గతేడాది కాలంగా భద్రతాపరమైన సవాళ్లను సైన్యం బలంగా ఎదుర్కొందనీ, సరిహద్దుల భద్రతకు భరోసా ఇచ్చిందని పాండే తెలిపారు.
 

Indian Army Day: వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ)గా పిలిచే భారత్-చైనా సరిహద్దు వెంబడి ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారత్ సిద్ధంగా ఉందని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే తెలిపారు. ఉత్తర సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి సాధారణంగానే ఉందనీ, శాంతిని కాపాడేందుకు అవసరమైన చర్యలు తీసుకున్నామని జనరల్ మనోజ్ పాండే కర్ణాటకలోని బెంగళూరులో జరిగిన వార్షిక ఆర్మీ డే  (Indian Army Day) కార్యక్రమంలో ప్రసంగిస్తూ చెప్పారు. ఎల్ఏసీ వద్ద బలమైన రక్షణ వ్యవస్థను కొనసాగిస్తూ, ఎలాంటి ఆకస్మిక పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. గతేడాది కాలంగా భద్రతాపరమైన సవాళ్లను సైన్యం బలంగా ఎదుర్కొందనీ, సరిహద్దుల భద్రతకు భరోసా ఇచ్చిందని జనరల్ పాండే అన్నారు. భవిష్యత్తులో జరిగే యుద్ధాల సన్నాహకాలను మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు. 

పశ్చిమ సరిహద్దులో కాల్పుల విరమణ ఉల్లంఘనలు తగ్గుముఖం పట్టినప్పటికీ, మరో వైపు ఉగ్రవాద మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అనేక ప్రాక్సీ సంస్థలు విజిబిలిటీని పొందడానికి లక్ష్యంగా హత్యలకు పాల్పడుతున్నాయని భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే.. పాకిస్తాన్ పై పరోక్షంగా విమర్శల దాడి చేశారు. ఆ దేశానికి చెందిన అనేక ఉగ్రవాద సంస్థలు మళ్లీ టెర్రర్ కార్యకలాపాలను పెంచడానికి ప్రయత్నిస్తున్నాయని తెలిపారు. ఇలాంటి ప్రయత్నాలన్నింటినీ తిప్పికొట్టేందుకు సైన్యంతో పాటు ఇతర భద్రతా బలగాలు కృతనిశ్చయంతో ఉన్నాయని స్పష్టం చేశారు. మన చొరబాట్ల నిరోధక గ్రిడ్ అక్కడి నుంచి చొరబాట్లను నిరంతరం తిప్పికొడుతోందని ఆర్మీ చీఫ్ పేర్కొన్నారు. జమ్మూకాశ్మీర్ ప్రజలు హింసను తిరస్కరించారనీ, సానుకూల మార్పులను స్వాగతిస్తున్నారని ఆయన ఉద్ఘాటించారు.

1949 తర్వాత తొలిసారిగా ఆర్మీ డే పరేడ్ ను ఢిల్లీకి బదులు బెంగళూరులో..

1949 తర్వాత తొలిసారిగా ఆర్మీ డే పరేడ్ ను దేశ రాజ‌ధాని ఢిల్లీకి బదులు క‌ర్నాట‌క‌లోని బెంగళూరులో నిర్వహించారు. ఆదివారం మధ్యాహ్నం నగరంలోని ఆర్మీ సర్వీస్ కార్ప్స్ (ఏఎస్సీ) సెంటర్ అండ్ కాలేజీలో మరో కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. గత సంవత్సరం, వైమానిక దళం తన వార్షిక ఫ్లైపాస్ట్, పరేడ్ ను సైతం ఢిల్లీ సమీపంలోని హిండన్ వైమానిక స్థావరం నుండి చండీగఢ్ కు మార్చింది.

జ‌న‌వ‌రి 15న ఎందుకు ఇండియ‌న్ ఆర్మీ డే ను జ‌రుపుకుంటారు..? 

భారత సైన్యం మొదటి కమాండర్ ఇన్ చీఫ్ - జనరల్ (తరువాత ఫీల్డ్ మార్షల్) కె.ఎం.కరియప్ప సాధించిన విజయాలకు గుర్తుగా భారతదేశం ప్రతి సంవత్సరం జనవరి 15న సైనిక దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ రోజున, 1947 యుద్ధంలో భారత దళాలను విజయం వైపు నడిపించిన కరియప్ప, 1949 లో చివరి బ్రిటిష్ కమాండర్-ఇన్-చీఫ్ జనరల్ సర్ ఎఫ్ఆర్ఆర్ బుచర్ నుండి భారత సైన్యం  కమాండ్ అధికారాల‌ను స్వీకరించారు. స్వతంత్ర భారతదేశ మొదటి భారతీయ కమాండర్-ఇన్-చీఫ్ గా అయ్యారు. కరియప్పను, రక్షణ దళాలను గౌరవించడానికి ప్రతి సంవత్సరం ఆర్మీ డే జరుపుకుంటాయి. 

జనవరి 15న జరిగే ఆర్మీ డే పరేడ్ లో ఎనిమిది కవాతు బృందాలు పాల్గొంటాయి. గ‌తేడాదివరకు ఢిల్లీలోని కరియప్ప పరేడ్ మైదానంలో ప్రధాన ఆర్మీ డే పరేడ్ నిర్వహించేవారు. అక్కడ ఆర్మీ చీఫ్ లు భారత సైన్యానికి నివాళులు అర్పించారు. ఆర్మీ డే పరేడ్ భారత సైన్యం ఇన్వెంటరీలో ఉన్న వివిధ ఆయుధ వ్యవస్థల పరిణామాన్ని ప్రదర్శిస్తుంది. సైనికులకు శౌర్య పురస్కారాలు, సేన పతకాలతో ఈ రోజును గౌర‌వ స‌త్కారాలు చేస్తారు.

click me!