
ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ముస్లింలనే టార్గెట్ చేసుకొని దాడులు చేస్తున్నారని ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఆరోపించారు. ఈ మేరకు గుజరాత్ లోని జునాగఢ్, ఉత్తరప్రదేశ్ లోని బులంద్ షహర్ లలో ముస్లిం వర్గానికి చెందిన పలువురిని కొట్టారని పేర్కొంటూ ఆయన శనివారం రెండు వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
నన్ను చంపేందుకు సుపారీ గ్యాంగులను రంగంలోకి దింపారు - జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు
ఆయన విడుదల చేసిన మొదటి వీడియోలో జునాగఢ్ లోని ఓ దర్గా మాదిరిగా కనిపిస్తున్న ఓ ప్రదేశంలో కొందరు వ్యక్తులు క్యూ కట్టి ఉన్నారు. వారిని ఇద్దరు వ్యక్తులు ముఖాలకు కండువాలు కట్టుకుని చితకబాదారు. అయితే ఈ వీడియోలో ఎంత వరకు వాస్తవం ఉందనే విషయం ఇంకా తెలియరాలేదు. అయితే ఈ వీడియోను ఆయన పోస్టు చేస్తూ.. ‘‘మొదటి వార్త : గుజరాత్ లోని జునాగఢ్ లో దర్గా కూల్చివేతకు వ్యతిరేకంగా నిరసన తెలియజేసిన ముస్లిం యువకులను పోలీసులు అదే దర్గా ముందు కొడుతున్నారు’’ అని ట్వీట్ చేశారు.
ఒవైసీ విడుదల చేసిన రెండో వీడియోలో ఓ వ్యక్తిని చెట్టుకు కట్టేసి, దాడి చేసి, అరగుండు గీసి, ముఖం కనిపించని కొందరు వ్యక్తులు అతడితో బలవంతంగా ‘జై శ్రీరామ్’ అని పలికేలా చేశారు. దీనిని ఆయన పోస్టు చేస్తూ.. ‘‘రెండో వార్త : బులంద్ షహర్ లో దినసరి కూలీని చెట్టుకు కట్టేసి, చితకబాది జై శ్రీరామ్ అని నినదించేలా చేశారు. ఆ తర్వాత పోలీసుల సానుభూతి చూడండి - దోషులపై చర్యలు తీసుకోవడానికి బదులు సాహిల్ ను జైలుకు పంపారు. ఆయనపై జరుగుతున్న అణచివేతపై ఫిర్యాదు చేస్తే ఎక్కడికి వెళ్లాలి’’ అని ఎంఐఎం ఎంపీ ప్రశ్నించారు.
'నేతాజీ జీవించి ఉంటే భారతదేశం ఎప్పటికీ విడిపోయేది కాదు'
కాగా.. ఒవైసీ ట్వీట్ లపై ఉత్తరాఖండ్ మాజీ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్ స్పందించారు. ఏఐఎంఐఎం అధినేత ట్వీట్ల ద్వారా మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. శాంతికి విఘాతం కలిగించడానికి, వాతావరణాన్ని చెడగొట్టడానికి ఆయనను అనుమతించబోమని అన్నారు. మత సామరస్యాన్ని కాపాడేందుకు మదర్సాలలో పిల్లలకు మంచి విలువలు నేర్పాలని 'మౌల్వీ'లకు రావత్ సూచించారు.
కాగా.. ఆక్రమణల నిరోధక చర్యల్లో భాగంగా శుక్రవారం రాత్రి జునాగఢ్ నగరంలో దర్గాకు నగరపాలక సంస్థ నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ఐదుగురు పోలీసులు గాయపడ్డారు. మజేవాడి దర్వాజా దర్గా సమీపంలో సుమారు 500-600 మంది ఆందోళనకారులు రాళ్లు రువ్వడం, పోలీసులతో ఘర్షణకు దిగడంతో 174 మందిని అదుపులోకి తీసుకున్నారు. రిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు బాష్పవాయు గోళాలు ప్రయోగించి ఆందోళనకారులపై లాఠీచార్జి చేశారు.