
కేరళలో ఒక ముస్లిం జంట అంతర్జాతీయ మహిళ దినోత్సవం రోజున మళ్లీ పెళ్లి చేసుకున్నారు. అయితే ఈ సారి ఆ జంట తమ కుమార్తెల ఆర్థిక భద్రత కోసం ప్రత్యేక వివాహ చట్టం కింద మళ్లీ తమ వివాహ ప్రమాణం చేశారు. ఈ చర్యను సోషల్ మీడియాలో కొందరు విమర్శించగా.. మరికొందరు మాత్రం వారికి మద్దతుగా పోస్టులు చేస్తున్నారు. వివరాలు.. సి షుకూర్ ప్రముఖ న్యాయవాది, నటుడిగా గుర్తింపు పొందారు. షీనా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం మాజీ ప్రో-వైస్ ఛాన్సలర్‌గా పనిచేశారు. వీరికి 1994 అక్టోబర్ 6న నికాహ్ జరిగింది.
అయితే ఈ జంట ఈ జంట బుధవారం ఉదయం కాసర్‌గోడ్ జిల్లా హోస్‌దుర్గ్ తాలూకాలోని కన్హంగాడ్‌లోని సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రెండో వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి ప్రత్యేక వివాహ చట్టం కింద జరగగా.. సాక్షులుగా వారి ముగ్గురు కూతుళ్లు హాజరయ్యారు. ఇక, ఆస్తి వారసత్వాన్ని కూడా నియంత్రించే ముస్లిం వ్యక్తిగత చట్టాల ప్రకారం.. కుమార్తెలు వారి తండ్రి ఆస్తిలో మూడింట రెండు వంతులు మాత్రమే పొందుతారు. మగ వారసుడు లేనప్పుడు మిగిలినవి తండ్రి సోదరులకు చెందుతాయి. అందుకే ఈ జంట ప్రత్యేక వివాహ చట్టం కింద పునర్వివాహం చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే బుధవారం ఉదయం ఈ జంట మళ్లీ పెళ్లి చేసుకున్నారు.
అయితే ఈ జంట నిర్ణయం ముస్లిం వ్యక్తిగత చట్టాలను, ఇస్లాంను అగౌరవపరిచే ప్రయత్నమని కేరళలోని ఒక ప్రముఖ సున్నీ ఉన్నత విద్యా సంస్థ అభిప్రాయపడింది. పునర్వివాహం ఒక నాటకం అని, షుకూర్ సోదరులు అతని మరణం తర్వాత అతని ఆస్తిలో మూడింట ఒక వంతు వాటా పొందకూడదనే సంకుచిత ఆలోచనకు ఇది సూచన అని పేర్కొంది. ప్రతి విశ్వాసి ఈ జంట నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తారని సంస్థ అభిప్రాయపడింది.
దీనిపై షుకూర్ తన ఫేస్‌బుక్ పేజీ వేదికగా స్పందించారు. ‘‘వ్యతిరేకత’’ అనే పదాన్ని తప్పుగా అర్థం చేసుకునే వారి నుంచి తాను ఎదుర్కొనే ఏదైనా భౌతిక దాడికి సదరు విద్యా సంస్థ బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. తన నిర్ణయం ఏదైనా మత విశ్వాసాలను అగౌరవపరచడం లేదా విశ్వాసుల మనోధైర్యాన్ని విచ్ఛిన్నం చేయడం లక్ష్యంగా పెట్టుకోలేదని స్పష్టం చేశారు. అందువల్ల ఎటువంటి ‘‘బలమైన వ్యతిరేకత’’ అవసరం లేదని ఆయన అన్నారు. చట్టాన్ని అమలు చేసే అధికారులు, పోలీసులు కూడా ఇలాంటి ప్రకటనలపై దృష్టి సారిస్తారని ఆశిస్తున్నాని పేర్కొన్నారు.
మరోవైపు ఈ జంట నిర్ణయానికి మద్దతుగా సోషల్ మీడియాలో అభినందనలు వెల్లువెత్తాయి. ప్రముఖ సినీ సౌండ్ డిజైనర్ రసూల్ పూకుట్టి ఈ చర్యను ఈ దేశంలోని ప్రతి ఉదారవాద ముస్లింలకు ఐ ఓపెనర్ అని పేర్కొన్నారు. ‘‘ఈ రోజు అతను వేసిన అడుగు ఈ దేశంలోని ప్రతి ఉదారవాద ముస్లింకి కన్ను తెరిచేది. అతని రెండో వివాహం కోసం నేను అతనితో ఉండలేకపోయాను. కానీ అతనిలోని స్పిరిట్, తీసుకున్న ధైర్యమైన నిర్ణయంతో నేను ఉన్నాను’’ పేర్కొన్నారు. అందరికి ఆల్ ది బెస్ట్ అని తెలిపారు. ఇక, ఈ జంట మళ్లీ పెళ్లి చేసుకోవడాన్ని సమర్ధిస్తున్న పలువురు కూడా.. ప్రముఖ సున్నీ ఉన్నత విద్యా సంస్థ ప్రకటనను ఖండించారు.