ముంబైలో కరోనా ఉగ్రరూపం: ఒక్కరోజే 204 కొత్త కేసులు, 11 మంది మృతి

By Siva Kodati  |  First Published Apr 14, 2020, 9:22 PM IST
దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. బాధితులతో పాటు మరణాల సంఖ్య కూడా తీవ్రమవుతున్నాయి. భారత్‌లో మహారాష్ట్రలోనే అత్యథిక కేసులు నమోదవుతున్నాయి. ఈ రాష్ట్రంలో ముంబై నగరం హాట్‌స్పాట్‌గా మారింది. 

గడచిన 24 గంటల్లో ముంబై మహానగరంలో 204 కొత్త కేసులు నమోదవ్వగా, 11 మంది మరణించారు. దీంతో ఇక్కడ కేసుల సంఖ్య 1,753కి, మరణాల సంఖ్య 111కి చేరింది. కాగా గడచిన 24 గంటల్లో దేశంలో 1,211 కరోనా పాజిటివ్ కేసులు, 31 మరణాలు నమోదైనట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

దీంతో దేశంలో మొత్తం కోవిడ్ 19 బాధితుల సంఖ్య 10,363కు చేరుకోగా.. వీరిలో 339 మంది మరణించారు. గత 24 గంటల్లో 179 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 5.29 కోట్లమందికి ఉచిత రేషన్, ఆహార ధాన్యాలు సరఫరా చేసినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.

ఇప్పటి వరకు మొత్తంగా 2.3 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది. 37 లక్షల ర్యాపిడ్ కిట్లు ఏ సమయంలోనైనా వచ్చే అవకాశం ఉందని వెల్లడించింది. 

కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకుగాను ఈ ఏడాది మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ ‌ను పొడిగిస్తున్నట్టుగా ప్రధాని మోడీ ప్రకటించారు. మరో 19 రోజుల పాటు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టుగా ఆయన స్పష్టం చేశారు. 

సోమవారం నాడు ఉదయం ప్రధాని మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కరోనా వైరస్ దేశంలో వేగంగా విస్తరిస్తోందన్నారాయన..ఎన్నో కష్టాలను ఎదుర్కొని దేశాన్ని రక్షించారన్నారు. కరోనాపై పోరాటానికి ప్రతి ఒక్కరూ సాగిస్తున్నారన్నారు. ఎన్నో కష్టాలను ఎదుర్కొని దేశాన్ని రక్షిస్తున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. 

కరోనాపై బారత్ బలంగా పోరాటం చేస్తున్న విషయాన్ని మోడీ గుర్తుచేశారు. లాక్ డౌన్ కాలంలో ప్రజలు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారని చెప్పారు. దేశంలోని కొన్ని రాష్ట్రాలు కొత్త సంవత్సరాన్ని జరుపుకొంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు.

కరోనాపై పోరాటం చేయడంలో దేశం మొత్తం ఒకేతాటిపై ఉందన్నారు ప్రధాని. దేశంలో ఒక్కకరోనా కేసు నమోదు కాకముందే దేశంలోకి వచ్చేవారిని స్క్రీనింగ్ చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
click me!