
కుండపోత వర్షాలతో దేశ వాణిజ్య రాజధాని తడిసిముద్దవుతోంది. గత శుక్రవారం నుంచి మొదలైన వర్షం నేటికీ కొనసాగుతూనే ఉంది. ఆదివారం రాత్రి ముంబై, శివారు ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షానికి ప్రధాన రహదారులు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నగరపాలక సంస్థ సహాయక చర్యలు చేపట్టినప్పటికీ వర్షం కారణంగా ఆటంకం ఏర్పడింది. రోడ్ల మీదకు భారీగా వర్షపు నీరు రావడంతో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. భారీ వర్షాల కారణంగా ముంబై మహానగరంలో రవాణా వ్యవస్థకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
వరద ప్రవాహం ఎక్కువ కావడంతో సియోన్ రైల్వేస్టేషన్- ముతుంగ స్టేషన్ మధ్య పట్టాలపైకి నీరు చేరడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలను నిషేధించారు. జామ్రంగ్-ఠాకూర్వాడీ మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో 10 రైళ్లను రద్దు చేశారు.
మరోవైపు మధ్య, పశ్చిమ, హార్బర్ మార్గంలో నడవాల్సిన లోకల్ రైళ్లను 15 నిమిషాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. వర్షం తీవ్రత దృష్ట్యా పశ్చిమ రైల్వే హెల్ప్‌లైన్ ను నెంబర్లను సోషల్ మీడియాలో ఉంచింది. రాగల నాలుగు గంటల్లో ముంబై, థానే, రాయ్‌గఢ్, పాల్ఘర్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.