
ముంబయి: మహారాష్ట్ర రాజధాని ముంబయిలో నిర్భయ తరహా లైంగికదాడికి గురైన ఓ మహిళ 33 గంటలపాటు హాస్పిటల్‌లో మృత్యువుతో పోరాడి ఓడారు. శనివారం ఉదయం ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమెపై పాశవిక లైంగికదాడి ముంబయిలోని సాకినాక సబర్బన్‌లో శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఆ దాడి వివరాలు తెలియడంతో 2012లో దేశాన్ని కదిలించిన ఢిల్లీ నిర్భయ కేసు మదిలో మెదిలింది.
కొందరు దుర్మార్గులు మహిళను బంధించి ఓ టెంపో వాహనంలో లైంగికదాడి చేశారని అనుమానిస్తున్నారు. అనంతరం ఆమె ప్రైవేటు భాగాల్లోకి రాడ్లు చొప్పించినట్టు తెలిసింది. ఆమె విలవిల్లాడుతుంటే ఆ కామాంధులు రాక్షసానందం పొందారు. చివరకు ఖైరాని రోడ్డుపక్కన ఆ బాధితురాలిని వదిలిపెట్టి పారిపోయినట్టు తెలిసింది.
ఆ మహిళను ఎవరో దాడి చేస్తున్నారని, రక్తపు మడుగులో మహిళ కొట్టుమిట్టాడుతున్నదని పోలీసుల కంట్రోల్ రూమ్‌కు ఓ కాల్ వచ్చింది. పోలీసులు వెంటనే స్పాట్‌కు చేరగా బాధితురాలు ఒక్కతే కొన ఊపిరితో జీవం కోసం పోరాడుతున్నట్టు గుర్తించారు. వెంటనే ఘాట్కోపర్‌లోని రాజావాడి ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందున్న ఆమె శనివారం ఉదయం మరణించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రధాన నిందితుడిగా భావిస్తున్న మోహన్ చౌహాన్(45)ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ దుర్మార్గంలో మరికొందరు ప్రమేయం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటన ఎప్పుడు జరిగిందనే విషయాన్ని పోలీసులు స్పష్టంగా వెల్లడించలేదు.