
Mahatma Gandhi's great-grandson Tushar A Gandhi: క్విట్ ఇండియా దినోత్సవం రోజున (ఆగస్టు 9, 1942) మహాత్మాగాంధీని బ్రిటిష్ పోలీసులు లక్ష్యంగా చేసుకున్న సరిగ్గా 81 సంవత్సరాల తరువాత, ఆయన మనుమడు తుషార్ గాంధీకి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. క్విట్ ఇండియా ఉద్యమంలో అమరులైన వారికి నివాళులు అర్పించేందుకు దక్షిణ ముంబయిలోని చారిత్రాత్మక ఆగస్టు క్రాంతి మైదానానికి వెళ్లేందుకు తుషార్ సిద్ధమవుతుండగా, బుధవారం శాంతాక్రజ్ పోలీసులు ఆయనను తన ఇంటి వెలుపలే అడ్డుకున్నారు.
'ఆగస్టు క్రాంతి దినోత్సవాన్ని పురస్కరించుకుని నేను బయలుదేరుతుండగా శాంతాక్రజ్ పోలీసులు నన్ను అడ్డుకునీ, లా అండ్ అర్డర్ అంశం అంటూ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం శాంతాక్రజ్ పోలీస్ స్టేషన్ లో ఉన్నాను' అని తుషార్ గాంధీ తెలిపినట్టు ఐఏఎన్ఎస్ నివేదించింది. మంగళవారం రాత్రి నుంచి ఇంటి ముందు వేచి ఉన్న పోలీసులు తుషార్ పై ఇలాంటి చర్యకు పాల్పడటం ఆయన జీవితంలో ఇదే తొలిసారి. భారత జాతిపిత మహాత్మాగాంధీ, కస్తూర్బాలను కూడా ఇదే చారిత్రాత్మక రోజున వలస బ్రిటిష్ పోలీసులు నిర్బంధించారని ఆయన గుర్తుచేశారు. అయితే, ఆగస్టు క్రాంతి మైదానానికి వెళ్లాలని యోచిస్తున్న ఇతర గాంధేయవాదులు, సంస్థల మాదిరిగా తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, తనపై ఎలాంటి అభియోగాలు మోపలేదని ఆయన అన్నారు.
ట్విట్టర్ వేదికగా తుషార్ గాంధీ.. ''స్వతంత్ర భారతదేశ చరిత్రలో మొదటిసారిగా నేను ఆగస్ట్ 9 క్విట్ ఇండియా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇంటి నుండి బయలుదేరినప్పుడు శాంటా క్రజ్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధించబడ్డాను. నా ముత్తాతలు బాపు, బాలను కూడా బ్రిటిష్ పోలీసులు చారిత్రాత్మక తేదీన అరెస్టు చేసినందుకు నేను గర్విస్తున్నాను అంటూ'' పేర్కొన్నారు.
ఇదే క్రమంలో తనను కూడా ఇంటి నుంచి బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారని సామాజిక కార్యకర్త తీస్తా సెతల్వాడ్ ఆరోపించారు. అయితే, ముంబయి పోలీసు ఉన్నతాధికారులు వారి వాదనలను తోసిపుచ్చారు. అనంతరం స్వాతంత్య్ర సమరయోధుడు డాక్టర్ జీజీ పారిఖ్ ను ఆగస్టు క్రాంతి మైదానానికి రాకుండా అడ్డుకున్నారని ఆరోపిస్తూ సంస్మరణ సభలో పాల్గొన్న కార్యకర్తల బృందం ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. ''మహాత్మాగాంధీ నాయకత్వంలోని చారిత్రాత్మక క్విట్ ఇండియా ఉద్యమం 81వ వార్షికోత్సవం సందర్భంగా మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం క్రూరమైన అణచివేతను చూశాం. మన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు 1943 నుండి మన స్వాతంత్య్ర పోరాట దినాన్ని స్మరించుకుంటున్నారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నప్పుడు యువ విద్యార్థిగా ఉండి, 99 ఏళ్ల వయసులో కూడా ఈ కవాతుకు నేతృత్వం వహించిన డాక్టర్ జీజీ.పారిఖ్ ఈ వింత పరిణామం పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు'' అని ఆ ప్రకటన పేర్కొంది.