
తమిళనాడు కోయంబత్తూర్‌లోని ఒక ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న విద్యార్థిని ఆర్ సుబలక్ష్మి (20) దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపింది. ఈ హత్య కేసుపై పోలీసులు విచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. కోయంబత్తూర్‌లోని ఎడయార్‌పాళయం వద్ద అద్వానీ నగర్‌లో సుబ్బలక్ష్మి నివాసం ఉంటుంది. ఆమె నగరంలోని శరవణంపట్టిలోని ఓ ప్రైవేట్ కళాశాలలో బీకాం చివరి సంవత్సరం చదువుతుంది. అయితే ఎడయార్‌పాళయంకు చెందిన సుజయ్‌కు (30) న్నేళ్ల క్రితం సుబలక్ష్మితో స్నేహం ఏర్పడింది. ఇది కాస్తా ప్రేమకు దారి తీసుకుంది. సుజయ్ ప్రస్తుతం ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నారు.
అయితే సుజయ్ రెండేళ్ల క్రితం కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన రేష్మ అనే మహిళను వివాహం చేసుకున్నాడు. పొల్లాచ్చి సమీపంలోని మహాలింగపురం గౌరీనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో దంపతులు నివాసం ఉంటున్నారు. సుజయ్ పెళ్లైనా తర్వాత కూడా సుబ్బలక్ష్మితో తన బంధాన్ని కొనసాగించాడు. అయితే మంగళవారం సాయంత్రం సుజయ్ నివాసం ఉంటున్న ప్లాట్‌కు సుబ్బలక్ష్మి వెళ్లింది. అయితే ఆ సమయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలోనే సుబ్బలక్ష్మిని రేష్మ కత్తితో పొడిచి చంపింది.
సుజయ్ మంగళవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ఎడయార్‌పాళయంలో నివాసం ఉంటున్న తన తల్లి గాంధీమతికి ఫోన్ చేశాడు. సుబలక్ష్మిని హత్య గురించి చెప్పాడు. ఆ తర్వాత సుజయ్, రేష్మలు అక్కడి నుంచి పారిపోయాడు. అప్పటి నుండి దంపతులు పరారీలో ఉన్నారు. అయితే సుబ్బలక్ష్మి హత్యకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటన స్థలానికి చేరుకున్నారు.
అక్కడ రక్తపు మడుగులో ఉన్న సుబ్బలక్ష్మి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనేక కత్తిపోట్లతో ఉన్న మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం కోయంబత్తూరులోని ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పరారీలో సుజయ్, రేష్మలను పోలీసులు గాలింపు చేపట్టారు. ఈ క్రమంలోనే ప్రత్యేక పోలీసు బృందం కేరళలోని కన్నూర్ సమీపంలో వారిని అరెస్టు చేసింది. అనంతరం వారిని కోయంబత్తూరు తీసుకొచ్చి జైలులో ఉంచారు.