ముంబయిలో భారీ వర్షం... రెడ్ అలర్ట్

By telugu teamFirst Published Jul 8, 2019, 4:37 PM IST
Highlights

దేశ ఆర్థిక రాజధాని ముంబయిని మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం కురిసిన భారీ వర్షానికి ముంబయి రోడ్లు వరదలా  పారుతున్నాయి. 

దేశ ఆర్థిక రాజధాని ముంబయిని మరోసారి వర్షాలు ముంచెత్తుతున్నాయి. సోమవారం కురిసిన భారీ వర్షానికి ముంబయి రోడ్లు వరదలా  పారుతున్నాయి. దీంతో ట్రాఫిక్ కి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముంబయితో పాటు పూణే, కొంకణ్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షం నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. తాజా వర్షాల కారణంగా అంధేరీ ఈస్ట్‌లో గోడ కూలిన ఘటనలో ఒకరు  తీవ్రంగా గాయపడ్డారు.

రానున్న 24 గంటల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురవనున్నాయని  ప్రకటించిన  వాతావరణ శాఖ అధికారులు రెడ్‌ అలర్ట్‌ జారీ చేశారు. ముఖ్యంగా రాయఘడ్‌, థానే, పాలఘర్‌  ప్రాంతాల్లో రేపు(మంగళవారం) భారీ వర్షాలు పడనున్నాయని అప్రమత్తంగా ఉండాలని సూచించారు.  అటు 40-50 కిలోమీటర్ల వేగంతో గాలులు, భారీ అలలు  తాకిడి ఉంటుందని ఈ నేపథ్యంలో శుక్రవారం వరకు  అరేబియా సముద్రంలోకి అడుగుపెట్టవద్దని మత్స్యకారులను  వాతావరణశాఖ హెచ్చరించింది.

మరోవైపు వాతావరణ  అననుకూల పరిస్థితులతో  ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో  సేవలను కొద్ది సేపు నిలిపివేశారు. దృశ్యమానత లోపించడంతో విమానా రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.   కొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్నింటిని దారి మళ్లిస్తున్నారు.  తమ విమానాల రాకపోకల వివరాలను  తప్పకుండా  చెక్‌  చేసుకోవాలని ఆయా విమాన సంస్థలు ప్రయాణకులకు  విజ్ఞప్తి చేశాయి.

click me!