
భారతదేశం ఎదుర్కొంటున్న భద్రతా సవాళ్ళు, పొరుగు దేశాలతో ముప్పుతో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సాంకేతికతతో కూడిన అత్యాధునిక ఆయుధాల వల్ల యుద్ద స్వభావం మారుతోంది. అందుకే మల్టి-డొమైన్ ఆపరేషన్స్ (MDO) ఇప్పుడు అత్యవసరం అయ్యాయి. భూమి, సముద్రం, గాలి, సైబర్, అంతరిక్షం వంటి డొమైన్‌లను కలిగి ఉన్న MDO ఏ సమయంలోనైనా, ఏ డొమైన్‌లోనైనా ప్రత్యర్థులపై పైచేయి సాధించడానికి, ప్రయోజనాన్ని పొందడానికి ఎంతో అవసరం అవుతున్నాయి.
మధ్యప్రదేశ్‌లోని మౌలోని ఆర్మీ వార్ కాలేజీలో రెండు రోజుల 'రణ్ సంవాద్ 2025' కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా “మల్టీ డొమైన్ ఆపరేషన్స్”పై అనేక సిద్ధాంతాలను విడుదల చేశారు. ఇందులో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ అనిల్ చౌహాన్, ఇండియన్ నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కె త్రిపాఠి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్ ఏసిఎం ఏపి సింగ్, ఇండియన్ ఆర్మీ వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ పిపి సింగ్ కూడా పాల్గొన్నారు.
మల్టి డొమైన్ ఆపరేషన్స్ ని మూడు సైనిక విభాగాలు ఎలా నిర్వహిస్తాయి? ఎలా ప్లాన్ చేస్తాయి? ఎలా పోరాడుతాయి? అనేవాటిని వివరించారు. ఏ డొమైన్‌లోనైనా, ఏ యుద్ధ స్థాయిలోనైనా ప్రత్యర్థిని ఓడించడానికి ఇవి ఉపయోగపడతాయి.
MDO సిద్ధాంతం లక్ష్యం… అన్ని డొమైన్‌లలో చర్యలను ఏకీకృతం చేయడం, బహుళ సైనిక, సైనికేతర భాగస్వాములతో సమన్వయం చేయడం. ఇది ప్రధానంగా సాయుధ దళాల సైనిక ప్రయత్నాలను సమన్వయం చేసే ఉమ్మడి కార్యకలాపాలకు భిన్నంగా ఉంటుంది.
జనరల్ అనిల్ చౌహాన్ ప్రకారం “MDO నిర్మాణం వేగంగా ప్రతిస్పందించే, చురుకైన దళాన్ని సిద్దంచేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది, ఇది గణనీయంగా పెరిగిన సైనిక శక్తిని ఉపయోగించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది, ఆపరేషన్ కేంద్రాలలో నిర్ణయం తీసుకునేవారికి అధికారం కల్పిస్తుంది.”