ముకేశ్ అంబానీ కుటుంబానికి బెదిరింపులు.. బిహార్‌లోని నిరుద్యోగి అరెస్టు

By Mahesh KFirst Published Oct 6, 2022, 2:43 PM IST
Highlights

ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ కుటుంబానికి ప్రాణ హాని తలపెడుతానని బెదిరించిన బిహార్‌కు చెందిన ఓ నిరుద్యోగ యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కు ఫోన్ చేసి ఈ బెదిరింపులు చేశారు. ముంబయి, బిహార్ పోలీసులు సంయుక్తంగా నిందితుడిని అరెస్టు చేశారు.

న్యూఢిల్లీ: వ్యాపార దిగ్గజం ముకేశ్ అంబానీ, ఆయన కుటుంబానికి ప్రాణ హాని తలపెడుతానని, వారి నివాసం ఆంటీలియాను పేల్చేస్తానని బెదిరించిన ఓ బిహార్ నిరుద్యోగిని పోలీసులు అరెస్టు చేశారు. ముంబయి పోలీసులు, బిహార్ పోలీసులు చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో వారు ఈ బెదిరింపులు ఇచ్చిన గంటల వ్యవధిలోనే యువకుడిని అరెస్టు చేసి ముంబయికి తీసుకు వచ్చారు. ఆ యువకుడిని రాకేశ్ కుమార్ మిశ్రాగా గుర్తించారు.

బుధవారం ముంబయిలోని హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌కు రెండు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ‘మధ్యాహ్నం 12.45 గంటలకు, సాయంత్రం 5.04 గంటలకు హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌ను పేల్చేస్తామని, ముకేశ్ అంబానీ, నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ, అనంత్ అంబానీలను చంపేస్తామని రెండు బెదిరింపు కాల్స్ వచ్చాయి’ అని ఆర్ఐఎల్ ప్రతినిధి ఓ ప్రకటనలో తెలిపారు. ముంబయిలోని ముకేశ్ అంబానీ నివాసం ఆంటీలియాను కూడా లేపేస్తామని బెదిరించినట్టు కొన్ని వర్గాలు తెలిపాయి.

Also Read: వరల్డ్స్ రిచెస్ట్ బిజినెస్‌మేన్ ముకేశ్ అంబానీకి జెడ్ ప్లస్ భద్రత.. ఎంత మంది రక్షణగా ఉంటారో తెలుసా?

అంబానీ కుటుంబానికి బెదిరింపులు రావడంతో పోలీసులు వేగంగా రంగంలోకి దిగారు. బిహార్‌లో దర్భంగాలోని ఓ బ్లాక్ నుంచి ముంబయి పోలీసులు బిహార్ పోలీసుల సహకారంతో అరెస్టు చేశారు. నిందితుడిని ప్రస్తుతం ముంబయికి తీసుకువస్తున్నారని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. తదుపరి దర్యాప్తు చేపడుతున్నట్టు వివరించారు. 

పోలీసుల ప్రకారం, నిందితుడిపై ఐపీసీలోని సెక్షన్లు 506(2), 507 కింద కేసు నమోదు చేశారు. నిందితుడు నిరుద్యోగి. అయితే, ఈ బెదిరింపు కాల్స్ చేయడం వెనుక గల లక్ష్యాన్ని ఇంకా వెల్లడించలేదు.

ఈ ఏడాది ఆగస్టులో ఓ జువెల్లర్ ఇలాగే బెదిరింపు కాల్స్ చేసి అరెస్టు అయ్యాడు.

click me!