
ప్రయాగరాజ్ కుంభమేళా అట్టహాసంగా సాగుతోంది. జనవరి 13న ప్రారంభమైన ఈ కుంభమేళా సాధువులు, భక్తులతో కిటకిటలాడుతోంది. ఈసారి కొంతమంది బాబాలు తమ విభిన్న జీవిత ప్రయాణాల కారణంగా సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నారు. వారిలో ఒకరే దిగంబర్ కృష్ణగిరి అలియాస్ "ఎంటెక్ బాబా".
దిగంబర్ కృష్ణగిరి ఒకప్పుడు రూ.40 లక్షల వార్షిక జీతంతో 400 మంది ఉద్యోగులకు అధిపతిగా ఉన్నారు. బెంగళూరుకి చెందిన ఆయన కర్ణాటక యూనివర్సిటీ నుండి ఎంటెక్ పూర్తి చేసి పలు ప్రముఖ కంపెనీలలో పనిచేశారు. చివరిగా ఢిల్లీలోని ఒక ప్రైవేట్ కంపెనీలో జనరల్ మేనేజర్ గా పనిచేసిన ఆయన జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది.
2010లో సన్యాసం స్వీకరించాలని నిర్ణయించుకుని 2019లో నాగ సాధువుగా మారానని దిగంబర్ కృష్ణ గిరి చెబుతున్నారు. మనశ్శాంతి కోసం హరిద్వార్‌లో 10 రోజులు భిక్షాటన చేశారు. "నా దగ్గర ఉన్నదంతా గంగానదిలో వదిలేశాను. డబ్బు ఎక్కువగా ఉంటే చెడు అలవాట్లు పెరుగుతాయి, మనశ్శాంతి దొరకదని నాకు అర్థమైంది" అని ఆయన చెబుతున్నారు.
కొత్త జీవితం గురించి దిగంబర్ కృష్ణగిరి మాట్లాడుతూ... "గూగుల్‌లో నిరంజన్ అఖాడా గురించి వెతికి, అక్కడ మహంత్ శ్రీ రామ్ రతన్ గిరి మహారాజ్ దగ్గర దీక్ష తీసుకున్నాను" అని చెప్పారు. ప్రస్తుతం ఉత్తరకాశిలోని ఒక చిన్న గ్రామంలో సాధువుగా జీవిస్తున్నానని తెలిపారు.