
న్యూఢిల్లీ: కేంద్రీయ విద్యాలయాల్లో పిల్లలను చేర్పించాలని చాలా మంది ఆరాటపడుతుంటారు. ఎలాంటి ప్రభుత్వ ఉద్యోగం చేయకున్నా.. తమ పిల్లలను అందులో చేర్పించాలని, అందులో చేర్పించడానికి ఉన్న అవకాశాలను వెతుకుతుంటారు. అందులో ఎంపీల కోటా ఒక్కటి. ఎంపీల కోటా ద్వారా ప్రభుత్వ ఉద్యోగం లేకున్నా పిల్లలను సదరు ఎంపీ రికమెండేషన్ ద్వారా కేంద్రీయ విద్యాలయాలో జాయిన్ చేస్తుంటారు. అయితే, ఎంపీ కోటా సహా పలు ఇతర కోటాలను గతేడాది కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే.
కానీ, ఇప్పటికీ చాలా మంది ఎంపీ కోటాలో తమ పిల్లలను కేంద్రీయ విద్యాలయాల్లో చేర్చవచ్చనే భ్రమల్లోనే ఉన్నారు. అంతేకాదు, ఈ కోటాను పునరుద్ధరిస్తారనే ఊహాగానాలూ బలంగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటా సహా మరే కోటా లేదని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి అన్నపూర్ణ దేవి రాజ్యభకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
రక్షణ, పారా మిలిటరీ, కేంద్ర స్వయంప్రతిపత్తి సంస్థలు, పీఎస్‌యూ, సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ వంటి కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పని చేసే సిబ్బంది తరుచూ బదిలీ అవుతుంటారు. స్థిరంగా ఒక చోట ఉండటం కుదరదు. కాబట్టి, వారితోపాటే కుటుంబం కూడా వెళ్లిపోతుంది. ఇలా తరుచూ మారుతుండటం వల్ల పిల్లల చదువు కుంటుపడిపోవద్దనే లక్ష్యంగా కేంద్రీ విద్యాలయాలను ఏర్పాటు చేసినట్టు కేంద్రం వెల్లడించింది. వారి కోసం దేశవ్యాప్తంగా ఒకే విధమైన విద్యను నేర్చుకునేందుకు వీలుగా వీటిని ప్రారంభించినట్టు వివరించింది.
Also Read: వైసీపీ, టీడీపీ ఒకే జట్టులో.. ఢిల్లీ బిల్లుపై ఎన్డీయేకు మద్దతుగా ఓటు.. బీఆర్ఎస్ ఏ పక్షమంటే?
కేంద్రీయ విద్యాలయాల లక్ష్యం ఇలా ఉంటే.. పలు కోటాల ద్వారా విద్యార్థులను తీసుకుంటే తరగతి గదిలో విద్యార్థుల సంఖ్య పెరిగిపోతుందని కేంద్రం పేర్కొంది. విద్యార్థుల సంఖ్య పెరిగిపోతే బోధనపై ప్రతికూల ప్రభావం పడుతుందని వివరించింది. ఈ కారణంగానే కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీల కోటాను రద్దు చేసినట్టు తెలిపింది. అంతేకాదు, మళ్లీ ఎంపీల కోటాను తీసుకువచ్చే ప్రతిపాదనేదీ ప్రస్తుతానికి కేంద్రప్రభుత్వం వద్ద లేదని కేంద్ర మంత్రి అన్నపూర్ణ దేవి స్పష్టత ఇచ్చారు.