
మహారాష్ట్రలో రాజకీయాలు (maharashtra crisis) గంట గంటకూ మారిపోతున్నాయి. తిరుగుబాటు ఎమ్మెల్యేలను దారిలోకి తెచ్చుకునేందుకు శివసేన (shivsena) అధినేత, సీఎం ఉద్ధవ్ థాక్రే (uddhav thackeray) పావులు కదుపుతున్నారు. ఎమ్మెల్యేలు మాట వినకుంటే అనర్హత వేటు వేస్తామని ఆయన హెచ్చరించినా ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన స్వతంత్ర ఎంపీ, సినీనటి నవనీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే గూండాయిజాన్ని అంతం చేయాలని.. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించాలని ఆమె డిమాండ్ చేశారు. అలాగే ఉద్ధవ్ థాక్రేపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు భద్రత కల్పించాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షాను నవనీత్ కౌర్ (navneet rana) కోరారు. బాల్ థాక్రే సిద్ధాంతాలను అనుసరిస్తూ, సొంత నిర్ణయాలు తీసుకుంటున్న రెబల్ ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులకు హాని కలిగే అవకాశం ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
కాగా.. ఇటీవల సీఎం ఉద్దవ్ థాక్రే ఇంటి ముందు హనుమాన్ చాలీసాను పఠించేందుకు నవనీత్ కౌర్ యత్నించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెను, ఆమె భర్తను అరెస్ట్ చేశారు. ఈ దంపతులు కొన్ని రోజులు రిమాండ్ లో ఉండి బెయిల్ పై విడుదలయ్యారు. అప్పటి నుంచి ఉద్దవ్ థాక్రేపై ఆమె మండిపడుతున్న సంగతి తెలిసిందే.
Also Read:వెళ్లేవారు వెళ్లొచ్చు.. కొత్త శివసేనను నిర్మిస్తా: రెబల్స్‌కు ఉద్ధవ్ ఠాక్రే సవాల్
మరోవైపు.. శివసేన రెబల్ ఎమ్మెల్యేలను ఉద్దేశించి మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. దమ్ముంటే శివసేన క్యాడర్‌ను తీసుకెళ్లండని ఏక్‌నాథ్ షిండే, బీజేపీకి ఆయన సవాల్ విసిరారు. అంతేకాదు, శివసేన ఓటర్లనూ తీసుకెళ్లే సాహసం ఉందా? అంటూ ప్రశ్నించారు. శివసేనను పూర్తిగా నాశనం చేయాలని బీజేపీ ప్రయత్నిస్తోందని ఉద్ధవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. శివసేన కార్పొరేటర్లను ఉద్దేశించి ఆయన వర్చువల్‌గా మాట్లాడారు. సాధారణ శివసేన కార్యకర్తలే తన ఆస్తులని ఆయన అన్నారు. శివసేన పార్టీని నమ్మినవారే మోసం చేశారని థాక్రే ఆవేదన వ్యక్తం చేశారు.
మీలాంటి వారు ఎందరో అభ్యర్థులు ఉన్నా.. మేం ఇలాంటి తిరుగుబాటుదారులకు టికెట్లు ఇచ్చామని అన్నారు. మీ కష్టంతోనే వీరు గెలిచి తర్వాత అసంతృప్తులుగా తయారయ్యారని పేర్కొన్నారు. కానీ, మీరు మాత్రం ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో పార్టీ వెంట నిలిచారని థాక్రే ధన్యవాదాలు తెలిపారు. కూటమి సభ్యులతో ఉన్న ఆరోపణలపై పరిశీలించడానికి ఏక్‌నాథ్ షిండేను రమ్మన్నానని ఆయన పేర్కొన్నారు. కానీ, చట్టసభ్యులు బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని తనను ఒత్తిడి చేస్తున్నట్టు ఆయన చెబుతున్నారు. అలాగైతే.. ఆ ఎమ్మెల్యేలను వెంటబెట్టుకుని తిరిగి రావాల్సిందిగా చెప్పానని, ఈ అంశంపై చర్చిద్దాం అని సూచించానని థాక్రే పేర్కొన్నారు. శివసేనతో బీజేపీ అభ్యంతరకరంగా వ్యవహరించిందని, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని ఆరోపించారు.