ఆ ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్‌లపై​ నిషేధం.. భ‌ద్ర‌తా కార‌ణాల దృష్ట్యా కీలక నిర్ణ‌యం 

By Rajesh KarampooriFirst Published Dec 6, 2022, 5:07 PM IST
Highlights

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలోని ప్రసిద్ధ మహాకాళేశ్వర ఆలయంలో మొబైల్ ఫోన్‌లను నిషేధించారు.  భద్రతా కారణాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆలయ కమిటీ తెలిపింది. ఈ నిషేధం డిసెంబర్ 20 నుండి అమల్లోకి వస్తుందని తెలిపారు. 

మధ్యప్రదేశ్‌లోని ఉజ్జ‌యిని మ‌హకాళేశ్వ‌ర్ ఆలయాన్ని సందర్శించే భక్తులకు గమనిక. ఇకనుంచి మహాకాళుని దర్శనానికి వెళ్లేవారు తమతో పాటు మొబైల్ ఫోన్ల‌ను తీసుకెళ్లలేరు. ఈ విషయాన్ని గమనించగలరు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఉజ్జయిని మహాకాల్ ఆలయంలో దర్శన నియమాలు మార్చబడ్డాయి. ఆలయంలోకి  మొబైల్ ఫోన్ల‌ను తీసుకెళ్లడం పూర్తిగా నిషేధబడింది. భద్రతా కారణాల దృష్ట్యా డిసెంబర్ 20 నుండి తమ మొబైల్ ఫోన్‌లను ప్రాంగణంలోనికి తీసుకెళ్లడానికి అనుమతించబడదని జిల్లా సీనియర్ అధికారి తెలిపారు. 

ఉజ్జ‌యిని మ‌హకాళేశ్వ‌ర్ ఆలయ నిర్వాహక కమిటీ చైర్మన్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సింగ్ నేతృత్వంలో సోమవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.భద్రతా కారణాల దృష్ట్యా డిసెంబర్ 20 నుంచి ఆలయం లోపల  మొబైల్ ఫోన్లను నిషేధిస్తున్నట్లు సమావేశం అనంతరం ఆశిష్ సింగ్ తెలియజేశారు.

భక్తులు మొబైల్ ఫోన్లు లేకుండా ఆలయానికి వచ్చేలా హోటళ్లు, ఇతర బస చేసే ప్రదేశాల్లో ఈ సమాచారాన్ని ఉంచాలని ఆదేశించామని కలెక్టర్ తెలిపారు. డిసెంబరు 20వ తేదీ నుంచి మహకాళ్‌ ఆలయంలో మొబైల్‌ తీసుకెళ్లడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆలయ నిర్వాహక కమిటీ నిర్ణయించింది. వీవీఐపీలు, భక్తులు, అధికారులు, పూజారులు కూడా మొబైల్ ఫోన్‌లను లోపలికి తీసుకెళ్లలేరు. ఈ సూచనలను కచ్చితంగా పాటించాలని ఆలయ కమిటీ ఆదేశాలు జారీ చేసింది. సోమవారం జరిగిన శ్రీ మహాకాళేశ్వర ఆలయ నిర్వహణ కమిటీ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.  

దేశంలోని 12 'జ్యోతిర్లింగాలలో' మహాకాళేశ్వరాలయం ఒకటి . ప్రతి ఏడాది వేలాది మంది భక్తులు త‌ర‌లివ‌స్తారు. పర్యాటకుల కోసం నగరంలో లగ్జరీ ఎయిర్ కండిషన్డ్ ఎలక్ట్రిక్ బస్సులను నడపనున్నట్లు కలెక్టర్ తెలిపారు. హాప్ ఆన్-హాప్ ఆఫ్ ప్రాతిపదికన అన్ని దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలను కవర్ చేసే రూట్లలో బస్సులు నడపబడతాయి, దీని కోసం సందర్శకులు ఒకే టికెట్ కొనుగోలు చేయాలని ఆయన చెప్పారు.

భక్తుల సహాయార్థం 50 ఫోన్‌లైన్స్‌ను కూడా త్వరలో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.ఇటీవల  త‌మిళనాడులోని దేవాల‌యాల్లోకి మొబైల్ ఫోన్ల‌ను అనుమ‌తించవ‌ద్ద‌ని మద్రాస్ హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే.. దర్శనానికి వచ్చే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులను ధరించాలని దేవాద‌య శాఖ‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.. 

అంతే కాదు మహాకాల్ ప్రసాదం రేటును కూడా పెంచారు.మహకాళ దేవాలయం లడ్డూ ప్రసాదం ధరలను కూడా ఆలయ కమిటీ పెంచింది. లడ్డూల ధర రూ.60 పెరిగింది. గతంలో రూ.300 ఉండగా.. ప్రస్తుతం రూ.360కి లడ్డూ ప్రసాదం లభిస్తుంది. లడ్డూ ప్రసాదం ఖరీదు రూ.374. రూ.60 పెంచినా ఆలయ కమిటీ రూ.14 నష్టపోవాల్సి వస్తోంది. మహాకాల్‌ను బహిరంగంగా ప్రారంభించిన తర్వాత.. పెరిగిన రద్దీ కోసం కొత్త ప్రణాళికను సిద్ధం చేస్తారు.

జలాభిషేక దర్శన విధానంలో  మార్పు

కొద్ది రోజుల క్రితమే..  మహాకాళ ఆలయ గర్భగుడిలో జలాభిషేక దర్శన విధానంలో మార్పు వచ్చింది. పాత రూ.1500 జలాభిషేక టిక్కెట్ విధానాన్ని డిజిటలైజ్ చేశారు. ఇప్పుడు భక్తులు కంప్యూటర్ జనరేట్ టిక్కెట్లు పొందుతున్నారు. గతంలో సాధారణ స్లిప్ అందుబాటులో ఉండేది.

రాహుల్ పర్యటనకు ముందే వివాదం

గతంలో కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ మహాకాళ దర్శనానికి ముందు నిబంధనల మార్పుపై పలు వివాదాలు చెలరేగాయి. గర్భగుడి లోపల ఫొటోలు, వీడియోలు తీయడాన్ని ఆలయ కమిటీ నిషేధించింది. ఇది రాజకీయ ప్రేరేపితమని పేర్కొన్న కాంగ్రెస్, రాహుల్ పర్యటన సాధ్యమైన దృష్ట్యా ఈ మార్పు చేసినట్లు ఆరోపించింది.

click me!