
ఎన్నికల సీజన్ వస్తుందంటే చాలు.. రాజకీయ నాయకులు జనాన్ని ఆకట్టుకోవడానికి రకరకాల స్టంట్లు చేస్తారు. త్వరలో మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండటంతో కాంగ్రెస్, బీజేపీలు సోషల్ మీడియా వేదికగా ప్రచారాన్ని ప్రారంభించారు. తాజాగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌ని బీజేపీ శ్రేణులు బాహుబలిని చేశాయి.
అందులో ప్రభాస్ పాత్రకు సీఎం ముఖాన్ని మార్ఫింగ్ చేశారు.. అంతేనా అమరేంద్ర బాహుబలి ప్రమాణ స్వీకారాన్ని కూడా మార్చేశారు. ‘‘శివరాజ్‌సింగ్ చౌహాన్ అనే నేను మధ్యప్రదేశ్ ప్రజల గౌరవాన్ని కాపాడుతానని.. విధి నిర్వహణలో ప్రాణ త్యాగానికైనా వెనుకాడనని.. నా మాటే శాసనం అంటూ సీఎం ప్రమాణం చేస్తున్నట్లుగా వాయిస్ ఇచ్చారు.
అక్కడితో ఆగకుండా శివలింగాన్ని శివరాజ్ చౌహాన్ భుజాల మీదకు ఎత్తుకుంటే.. రాహుల్ గాంధీ, సోనియా గాంధీ సహా ఇతర కాంగ్రెస్ నేతలు ఆశ్చర్యకరంగా చూస్తున్నట్లుగా వీడియో రూపొందించారు. కట్టప్పగా కేంద్రమంత్రి నరేంద్రసింగ్ తోమర్‌ను, భల్లాలదేవుడిగా జ్యోతిరాదిత్య సింధియాను చూపారు.
అయితే ఈ స్పూఫ్‌పై నెటిజన్లు కామెంట్లు విసురుతున్నారు.. ప్రజలు వివిధ సమస్యలతో బాధపడుతుంటే.. బీజేపీ ఇలాంటి వీడియోలు తీయడం సబబు కాదంటున్నారు. అసలు బాహుబలి ఎవరో త్వరలో తేలిపోతుందని అప్పటి వరకు బీజేపీ నేతలు ఓపిక పట్టాలి అంటూ సెటైర్లు పేలుస్తున్నారు. మరోవైపు ఈ వీడియోకు తమకు ఎలాంటి సంబంధం లేదని.. పార్టీ అభిమానుల్లో ఎవరో దీనిని రూపొందించి ఉంటారని బీజేపీ వాదిస్తోంది.