Mother Dead Body : తల్లి శవంతో ఏడాదిగా ఒకే ఇంట్లో అక్కా చెల్లెళ్లు.. ఎందుకంటే ?

By Asianet News  |  First Published Dec 1, 2023, 11:12 AM IST

ఏడాదిగా తల్లి శవంతో ఇద్దరు అక్కాచెల్లెళ్లు జీవిస్తున్న ఘటన ఉత్తరప్రదేశ్ లోని వారణాసి ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. అనారోగ్య కారణాలతో ఆమె ఏడాది కిందట చనిపోగా.. ఈ విషయాన్ని అక్కాచెల్లెళ్లు ఎవరికీ చెప్పలేదు. కారణం ఏంటంటే ? 


ఉత్తర్‌ప్రదేశ్‌లోని వారణాసిలో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ తల్లి మృతదేహంతో ఒక ఇంట్లో నివసిస్తున్నారు. ఆ మహిళా గతేడాది డిసెంబర్ లో మరణించింది. అయితే ఈ విషయం అక్కా చెల్లెళ్లు ఎవరికీ చెప్పలేదు. మృతదేహానికి దహన సంస్కారాలు చేయలేదు. అలాగే ఇంట్లోనే ఉంచుకున్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వారణాసిలోని మందర్వా ప్రాంతంలో ఉషా (52) తన ఇద్దరు కూతుర్లు  27 ఏళ్ల పల్లవి, 18 వైశ్విక్ తో కలిసి జీవించేది. ఆమె భర్త రెండు సంవత్సరాల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. పెద్ద కూతురు పీజీ పూర్తి చేసింది. రెండో కూతురు ప్రస్తుతం టెన్త్ క్లాస్ చదువుతోంది. కుటుంబ పోషణ కోసం తల్లి ఓ చిన్న కిరాణా షాప్ నడిపించేంది. 

Latest Videos

అయితే ఉషా అనారోగ్య కారణాలతో 2022 డిసెంబర్ లో మరణించింది. ఈ విషయాన్ని అక్కా చెల్లెళ్లు తట్టుకోలేకపోయారు. అందుకే తల్లి చనిపోయిందని ఎవరికీ చెప్పలేదు. తల్లి మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచుకున్నారు. తమకు అవసరమైన వస్తువుల కోసం అక్కాచెల్లెళ్లు ఇద్దరూ కొన్ని సార్లు బయటకు వెళ్లేవారు. ఆ వస్తువులను తెచ్చుకునేవారు. 

మృతురాలు ఉషాకు ధర్మేంద్ర కుమార్ అనే సోదరుడు ఉన్నారు. ఆయన మీర్జాపుర్ లో నివసించేవారు. అయితే గత బుధవారం తన సోదరిని చూసేందుకు మందర్వాకు వచ్చారు. సోదరి ఇంటికి చేరుకొని తలుపులు కొట్టారు. కానీ లోపలి నుంచి అక్కాచెల్లెళ్లు గడియ పెట్టుకున్నారు. ఎంత సేపు తలుపు బాదినా వారు తెరవలేదు. దీంతో ఆయనకు అనుమానం వచ్చింది. 

వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు తలుపులు పగలగొట్టారు. లోపలున్న పరిస్థితి చూసి అందరూ ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఓ రూమ్ లో ఉషా మృతదేహం, మరో రూమ్ లో ఇద్దరు సోదరీమణులు కనిపించారు. అయితే పోలీసుల దర్యాప్తులో ఆ ఇద్దరు అక్కాచెల్లెళ్ల మానసిక ఆరోగ్యం బాగా లేదని నిర్ధారణ అయ్యింది. అందుకే వారు ఈ విషయం ఎవరికీ చెప్పలేదని తేలింది. దీంతో వారిద్దరినీ పోలీసులు హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

click me!