
మధ్య ప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అత్తగారు సెల్‌ఫోన్ లాక్కుందని కోడలు తన ఇద్దరు పిల్లలను బావిలోకి తోసి.. తాను ఆత్మహత్య చేసుకుంది. ఈ హృదయ విదారక సంఘటన ఛతర్‌పూర్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సతాయ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పర్వ గ్రామానికి చెందిన రాణీ యాదవ్, కన్హయ్య యాదవులు దంపతులు.
అయితే శనివారం రాణీ యాదవ్ కి ఆమె అత్త గారితో గొడవ జరిగింది. ఆ సమయంలో మహిళ భర్త ఇంట్లో లేడు. కోపంతో అత్తగారు కోడలి మొబైల్ని లాక్కుని తన వద్ద ఉంచుకుంది. ఇది రాణి యాదవ్ కి కోపం తెప్పించింది. ఆమెకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఒకరి వయసు పది సంవత్సరాలు, మరొకరి వయసు నాలుగు సంవత్సరాలు.
అత్తగారు చేసిన పనికి కోపంతో ఊగిపోయిన కోడలు క్షణికావేశంలో అభం, శుభం తెలియని ఇద్దరు కూతుళ్ళను బావిలోకి తోసేసింది. అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
ఈ సంఘటనలో పదేళ్ల కుమార్తె మరణించగా, నాలుగేళ్ల బాలిక బావిలో ఉండే చెట్ల మధ్య చిక్కుకుని బయటపడింది. అయితే, చిన్న పిల్లల ఏడుపు వినిపించడంతో అటుగా వెళ్తున్న స్థానికులు బావిలోకి తొంగి చూసి పాపను కనుగొన్నారు. ఆమెను కాపాడి ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానిక ప్రజల సహాయంతో మరో కూతురు మృతదేహాన్ని బయటకు తీశారు. రెండు మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆ తర్వాత కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.