ఈ వేసవిలో ఆ పది రాష్ట్రాల్లో ఎక్కువ వడగాలులు.. చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు: ఐఎండీ

By Mahesh KFirst Published Apr 1, 2023, 5:38 PM IST
Highlights

ఈ ఏడాది వేసవిలో కనీసం పది రాష్ట్రాల్లో వడగాలులు వీచే రోజులు అధికంగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. వాయవ్య ప్రాంతం, తీర ప్రాంతాలు మినహా చాలా ప్రాంతాల్లో సాధారణ గరిష్టాల కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది.
 

న్యూఢిల్లీ: ఈ ఏడాది వేసవిలో కనీసం పది రాష్ట్రాల్లో వడగాలులు వీచే రోజులు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఏప్రిల్ నుంచి జూన్ నెల వరకు దేశంలోని తీర ప్రాంతాలు, వాయవ్య ప్రాంతాలు మినహా మిగతా ఏరియాల్లో సాధారణం కంటే గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఇండియా మెటీయోరలాజికల్ డిపార్ట్‌మెంట్ (ఐఎండీ) శనివారం వెల్లడించింది.

దేశంలోని మధ్య, తూర్పు, వాయవ్య ప్రాంతాల్లో వడగాలులూ అధికంగా వీచే అవకాశాలు ఉన్నాయి. గతంలో కంటే వేడైన వడగాలులు వీస్తాయని ఐఎండీ తెలిపింది. ‘2023 వేసవిలో దేశంలోని చాలా ప్రాంతాలు సాధారణ గరిష్ట ఉష్ణోగ్రతల కంటే అధికంగా నమోదవుతాయి. దక్షిణ తీర ప్రాంతాలు, నదీ ప్రాంతాలు, వాయవ్య ప్రాంతాలు ఇందుకు మినహాయింపు. ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణ గరిష్టాల కంటే కొంత తక్కువగా ఉంటాయి’ అని ఐఎండీ తెలిపింది.

కనీసం పది రాష్ట్రాల్లో వడగాలులు అధికంగా వీచే అవకాశాలు ఉన్నాయని వివరించింది. బిహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, ఛత్తీస్‌గడ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాల్లో వడగాలులు వీచే రోజులు ఎక్కువగా ఉంటాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.

Also Read: లవర్ చీట్ చేశాడు.. రద్దీ రోడ్డుపై రచ్చ రచ్చ చేసిన యువతి.. వైరల్ వీడియో ఇదే

దేశంలో ఏప్రిల్ మాసంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వెదర్ బ్యూరో అంచనా వేసింది. వాయవ్య, మధ్య, తీర ప్రాంతాల్లో సాధారణం, సాధారణం కంటే అధిక వర్షపాతం పడే అవకాశం ఉందని, కాగా, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో సాధారణం కంటే స్వల్ప వర్షపాతం కురిసే అవకాశం ఉన్నదని వివరించింది.

click me!