
న్యూఢిల్లీ: కేంద్ర విజిలెన్స్ కమిషన్ వార్షిక నివేదికను వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం అత్యధికంగా అవినీతి ఫిర్యాదులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు వ్యతిరేకంగానే నమోదయ్యాయని తెలిసింది. ఆ తర్వాత అత్యధిక ఫిర్యాదులు రైల్వే శాఖ, బ్యాంకులపై వచ్చినట్టు వివరించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అధికారులు, ఉద్యోగులపై ఏడాది (2022) కాలంలో మొత్తం 1,15,203 అవినీతి ఫిర్యాదులు వచ్చినట్టు పేర్కొంది.
ఈ మొత్తం ఫిర్యాదుల్లో 85,437 ఫిర్యాదులను పరిష్కరించి క్లోజ్ చేశారు. మరో 29,766 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 22,034 ఫిర్యాదులు మూడు నెలలకు మించి పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఫిర్యాదులను పరీక్షించడానికి చీఫ్ విజిలెన్స్ అధికారులకు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఇచ్చే కాల అవధి మూడు నెలలు.
కేవలం హోం మంత్రిత్వ శాఖ ఉద్యోగులకు వ్యతిరేకంగానే 46,643 అవినీతి ఫిర్యాదులు వచ్చాయి. 10,580 ఫిర్యాలులు రైల్వే శాఖ ఉద్యోగులు, 8,129 ఫిర్యాదులు బ్యాంకు అధికారులు, ఉద్యోగులకు వ్యతిరేకంగా వచ్చాయని సీవీసీ రిపోర్ట్ పేర్కొంది.
Also Read: తల్లి క్యాన్సర్ చికిత్స కోసం ఏటీఎం దొంగతనం.. యూట్యూబ్ చూసి ట్రైనింగ్..
హోం మంత్రిత్వ శాఖ అధికారులు, ఉద్యోగులపై నమోదైన మొత్తం కేసుల్లో 23,919 ఫిర్యాదులు పరిష్కృతమయ్యాయి. మరో 22,724 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో 19,198 ఫిర్యాదులు మూడు నెలలకు మించి పెండింగ్‌లో ఉన్నాయి. అదే రైల్వే శాఖపై 9,663 ఫిర్యాదులు రాగా, అందులో 917 ఫిర్యాదులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. ఇందులో తొమ్మిది ఫిర్యాదులు మూడు నెలలకు మించి పెండింగ్‌లో ఉన్నాయి. ఇక బ్యాంక్‌లపై 7,762 ఫిర్యాదులు రాగా, 367 పెండింగ్‌లో ఉండగా 78 మూడు నెలలకు మించి పెండింగ్‌లో ఉన్నాయి.
రక్షణ శాఖ ఉద్యోగులపై 1,619 ఫిర్యాదులు వచ్చాయని తాజాగా విడుదల చేసిన ఈ సీవీసీ రిపోర్ట్ వెల్లడించింది. 1,202 ఫిర్యాదులు ఆర్థిక శాఖపై వచ్చాయి.