
వేర్వేరు మతాలకు చెందిన జంట వివాహం చేసుకోగా.. యువతిని ఆమె తల్లిదండ్రులు తీసుకెళ్లిపోయారు. దీంతో సాయం కోరుతూ యువకుడు వేసిన Habeas Corpus petitionను విచారణకు స్వీకరించిన మధ్యప్రదేశ్ హైకోర్టు (Madhya Pradesh high court) శనివారం కీలక తీర్పు వెలువరించింది. మతాంతర వివాహం చేసుకున్న ఆ దంపతులకు సాయంగా నిలిచింది. యువతి తిరిగి తన భర్త వద్దకు చేరేలా చూడాలని పోలీసులను ఆదేశించింది. ఇందులో మోరల్ పోలీసింగ్ అవసరం లేదని స్పష్టం చేసింది.
అసలేం జరిగింది.. 19 ఏళ్ల ఓ యువతి 2021 డిసెంబర్ 28న ముస్లిం యువకుడు గుల్జార్ ఖాన్‌ను వివాహం చేసుకుంది. అయితే యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు జబల్‌పూర్ శివార్లలోని చిన్న పట్టణమైన గోరఖ్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతి కనిపించడం లేదని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు.
కట్ చేస్తే.. జనవరి 21న తన భార్యను ఆమె తల్లిదండ్రులు బలవంతంగా వారణాసి తీసుకెళ్లారని గుల్జార్ ఖాన్ మధ్యప్రదేశ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారు తన భార్యను బలవంతంగా తీసుకెళ్లారని కూడా ఆరోపించాడు. ఈ కేసు విచారణ సందర్భంగా యువతి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరైంది. తన వయసు 18 ఏళ్ల కంటే ఎక్కువేనని తెలిపింది. పిటిషనర్‌ను (గుల్జార్ ఖాన్) ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకున్నాని తెలిపింది. అంతేకాకుండా తాను ఇస్లాం మతంలోకి మారానని కోర్టుకు తెలియజేసింది.
ఈ సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నందితా దూబే స్పందిస్తూ.. ఇద్దరు మేజర్లు పెళ్లి చేసుకుని కానీ, లివ్ ఇన్ రిలేషన్‌షిప్‌లో కానీ.. కలిసి ఉండటానికి ఇష్టపడిన పక్షంలో మోరల్ పోలిసింగ్ అనుమతించబడదని చెప్పారు. వారిద్దరు అందుకు ఏర్పాటు చేసుకున్నప్పుడు బలవంతం చేయకూడదని తెలిపారు. ‘బంధించబడిన వ్యక్తి వయసు వివాదస్పదంగా ఉందని ఎవరు కూడా చెప్పలేదు. ఈ దేశంలో ప్రతి మేజర్ స్త్రీకి గానీ, పురుషుడికి గానీ ఇష్టానుసారం జీవించడానికి రాజ్యాంగం హక్కును ఇస్తుంది’ అని కోర్టు ఉత్తర్వు పేర్కొంది.
ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది ప్రియాంక మిశ్రా వాదనలు వినిపిస్తూ.. ఈ వివాహం మధ్యప్రదేశ్ Freedom of Religion Act 2021ను ఉల్లంఘించిందని తెలిపారు. ఈ చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం, ఏ వ్యక్తి కూడా వివాహం కోసం మతం మారకూడదని.. ఈ నిబంధనకు విరుద్ధంగా ఏదైనా మార్పిడి జరిగితే అది శూన్యమైనదిగా పరిగణించబడుతుందని తెలిపారు. అయితే ఆ వాదనను న్యాయస్థానం తోసిపుచ్చింది.
‘మహిళను బలవంతంగా మతమార్పిడి చేయలేదని,..రాజ్యాంగంలో వారికి కల్పించిన హక్కుల ప్రకారం వారు వివాహం చేసుకున్నందున ఈ కేసు చట్టాన్ని ఉల్లంఘించదని కోర్టు పేర్కొంది’ అని పిటిషనర్ తరఫు న్యాయవాది జునేద్ ఖాన్ తెలిపారు.
పిటిషనర్‌కు అతని భార్యను అప్పగించాలని, దంపతులు సురక్షితంగా వారి నివాసానికి చేరుకునేలా చూడాలని మధ్యప్రదేశ్ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని, పోలీసులను ఆదేశించింది. కార్పస్(యువతి) తల్లిదండ్రుల నుండి జంట బెదిరింపులకు గురికాకుండా చూసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది.