
Monkeypox: దేశంలో మంకీపాక్స్ ఆందోళనలు క్రమంగా పెరుగుతున్నాయి. పలు దేశాల్లో మంకీపాక్స్ కేసులు క్రమంగా పెరుగుతుండటంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) అన్ని దేశాలను హెచ్చరిస్తోంది. భారత్ లో ఇప్పటికే ఐదు మంకీపాక్స్ కేసులు నిర్ధారణ అయ్యాయి. అనుమానిత కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. దీనికి తోడు కేరళలో మంకీపాక్స్ లక్షణలతో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే కేరళ సర్కారు ఈ ఘటనపై హై-లెవల్ ఎంక్వైరీ జరుపుతోంది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ మాట్లాడుతూ.. త్రిసూర్ జిల్లాలోని చావక్కాడ్ కురంజియూర్‌కు చెందిన యువకుడు, విదేశాలలో వైరల్ వ్యాధికి పాజిటివ్ పరీక్షించారని, చికిత్స పొందడంలో జాప్యంపై దర్యాప్తు చేస్తామని చెప్పారు.
వివరాల్లోకెళ్తే.. మంకీపాక్స్ వ్యాధి కారణంగా దక్షిణాది రాష్ట్రమైన కేరళలో ఒక వ్యక్తి మృతి చెందడంపై కేరళ ఆరోగ్య శాఖ ఉన్నత స్థాయి దర్యాప్తును ప్రారంభించింది. మంకీపాక్స్ తోనే ఇతను ప్రాణాలు కోల్పోయినట్టు నిర్ధారణ అయితే, దేశంలో జూనోటిక్ వ్యాధితో సంబంధం ఉన్న మొదటి మరణం ఇదే అవుతుంది. కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ ఈ ఘటనపై స్పందించారు. ఆమె మీడియాతో మాట్లాడుతూ.. యువకుడు త్రిసూర్ జిల్లాలోని చవక్కాడ్ కురంజియూర్‌కు చెందినవాడని తెలిపారు. విదేశాలలో వైరల్ వ్యాధికి పాజిటివ్ పరీక్షించాడని తెలిపారు. చికిత్స తీసుకోవడంలో జాప్యంపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరుపుతున్నదని ఆమె తెలిపారు.
"సదరు యువకునికి విదేశాలలో నిర్వహించిన పరీక్ష ఫలితం మంకీపాక్స్ కు సానుకూలంగా ఉంది. తీవ్రమైన అలసట, మెదడువాపు కారణంగా అతను త్రిస్సూర్‌లో చికిత్స పొందాడు. అయితే, మంకీపాక్స్ ప్రాణాంతక వ్యాధి కాదు" అని వీణాజార్జ్ పేర్కొన్నట్టు ఏఎన్ఐ నివేదించింది. దీనికి సంబంధించి త్రిసూర్‌లోని పున్నయూర్‌లో సమావేశం నిర్వహించనున్నారు. మరణించిన యువకుడి కాంటాక్ట్ లిస్ట్, రూట్ మ్యాప్ తయారు చేయబడుతోందన్నారు. అతని కాంటాక్ట్‌లో వచ్చిన వారిని ఐసోలేషన్ చేయమని కోరుతున్నట్లు మంత్రి తెలిపారు. కాగా, భారతదేశంలో ఇప్పటివరకు ఐదు మంకీపాక్స్ వ్యాధి కేసులు నమోదయ్యాయి. అందులో మూడు కేసులు కేరళ నుండి, ఒకటి ఢిల్లీ నుండి మరియు ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు నుండి నివేదించబడినట్టు సమాచారం. అనుమానిత కేసులు అధికంగానే ఉన్నాయి.
దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. నీతి ఆయోగ్ సభ్యుడు (ఆరోగ్యం) డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ వ్యాధిని అదుపులో ఉంచడానికి ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకున్నందున ఎటువంటి భయాందోళన అవసరం లేదని తెలిపారు. కాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించిన వివరాల ప్రకారం.. 78 దేశాల నుండి 18,000 కంటే ఎక్కువ మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. పలు దేశాల్లో కొత్త కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. కేవలం ఆఫ్రికా దేశాలకు మాత్రమే పరిమితమై ఉండే మంకీపాక్స్ కేసులు ప్రస్తుతం ప్రపంచంలోని చాలా దేశాలకు వ్యాపించాయి. ఈ క్రమంలోనే ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ వో) మంకీపాక్స్ వ్యాప్తిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా ప్రకటించింది. "దేశాలు, వివిధ సమూహాలు, సంఘాలు, వ్యక్తులు తమను తాము తెలియజేసుకుని, ప్రమాదాలను తీవ్రంగా పరిగణించి, ప్రసారాన్ని ఆపడానికి-హాని కలిగించే సమూహాలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటే మంకీపాక్స్ వ్యాప్తిని ఆపవచ్చు" అని WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ ఘెబ్రేయేసస్ అన్నారు.