మంకీ ఫీవర్ కలకలం.. మళ్లీ విజృంభణ..! కర్ణాటకలో మహిళకు పాజిటివ్

By Mahesh KFirst Published Jan 22, 2022, 1:22 PM IST
Highlights

కర్ణాటకలో మరోసారి మంకీ ఫీవర్ కలకలం రేపింది. శివమొగ్గ జిల్లాలోని కుడిగె గ్రామానికి చెందిన 57 ఏళ్ల మహిళలో కేఎఫ్‌డీ వైరస్ పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ రాష్ట్రంలో మరోసారి ఆందోళనలు బయల్దేరాయి. 2019 తర్వాత మళ్లీ తొలిసారిగా ఈ కేసు రిపోర్ట్ కావడం గమనార్హం. కేఎఫ్‌డీ వైరస్‌నే మంకీ ఫీవర్ అని పిలుస్తారు. ఈ వైరస్ సోకిన వారిలో తీవ్ర జ్వరం, తలనొప్పి మరికొన్ని లక్షణాలు ఉంటాయి. 
 

బెంగళూరు: దేశంలో ఒక వైపు కరోనా కేసులు(Corona Cases) భారీగా రిపోర్ట్ అవుతుండగా.. మరో వైరస్ కలకలం రేపుతున్నది. ఒక్క రోజే మూడు లక్షలకు మించి కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. వరుసగా రెండు రోజులూ మూడు లక్షలకు పైగా కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గబ్బిలాల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకినట్టుగా తొలుత వాదనలు వచ్చాయి. అయితే, ఇప్పుడు మంకీ ఫీవర్(Monkey Fever) మరోసారి ముందుకు వచ్చి వణికిస్తున్నది. కర్ణాటక(Karnataka) రాష్ట్రం శివమొగ్గలో మరోసారి మంకీ ఫీవర్ కేసు రిపోర్ట్ అయింది. తీర్థ హల్లీకి చెందిన కుడిగె గ్రామంలో 57 ఏళ్ల మహిళకు ఈ వ్యాధి సోకినట్టు వైద్యులు నిర్ధారించారు.

ఆమె పది రోజులకుపైగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నారు. ఆమె బ్లడ్ శాంపిల్‌ను తీసుకుని కేఎఫ్‌డీ(క్యాసనూర్ ఫారెస్ట్ డిసీజ్) వైరస్‌ కోసం టెస్టు చేశారు. అందులో ఈ వైరస్ ఉన్నట్టు తేలింది. ఈ కేఎప్‌డీ వైరస్‌(KFD Virus)నే మంకీ ఫీవర్ అని కూడా పిలుస్తారు. 2019 తర్వాత ఈ మంకీ ఫీవర్ మళ్లీ వెలుగులోకి వచ్చింది. డిసెంబర్ 2019లో కర్ణాటకలోని సాగర్ తాలూకా అరలగోడులో మంకీ ఫీవర్ ప్రబలింది. అప్పుడు కర్ణాటక వ్యాప్తంగా భయాందోళనలు ఏర్పడ్డాయి. ఆ సమయంలో 22 మంది ఈ మంకీ ఫీవర్‌కు బలయ్యారు. మొత్తంగా ఇప్పటి వరకు మంకీ ఫీవర్ కారణగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా మహమ్మారి దేశంలోకి ప్రవేశించే సమయానికి ఈ కేసులు సున్నాకు చేరాయి.

గత రెండేళ్ల కాలంగా ఈ వ్యాధి మళ్లీ రిపోర్ట్ కాలేదు. అంతా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, తాజాగా, మరోసారి ఈ కేసు రిపోర్ట్ కావడంతో అధికారులు ఆందోళనలో మునిగారు. కుడిగె గ్రామానికి చెందిన ఆ మహిళ కొన్ని రోజులుగా తీవ్ర జ్వరంతో బాధపడ్డారు. దీంతో ఆమెను తీర్థహల్లి తాలూకా హాస్పిటల్‌కు తీసుకుపోయారు. ఆ తర్వాత శుక్రవారం సాయంత్రం ఆమెను మణిపాల్ హాస్పిటల్‌కు తరలించారు. కుడిగె గ్రామం దట్టమైన అడవి మధ్యలో ఉండటంతో అధికారుల్లో మంకీ ఫీవర్ అనుమానాలూ తలెత్తాయి.

దీంతో ఆమె నుంచి బ్లడ్ శాంపిల్ తీసుకుని కేఎప్‌డీ వైరస్ గురించి టెస్టు చేశారు. మొత్తం అక్కడ 50 మంది నుంచి బ్లడ్ శాంపిళ్లు తీసుకుని కేఎఫ్‌డీ వైరస్ ఉన్నదా? లేదా? అనే పరీక్ష చేశారు. ఇందులో ఒక్కరికి కేఎప్‌డీ వైరస్ పాజిటివ్‌గా తేలింది. 

కేఎఫ్‌డీ వైరస్ ప్రాథమికంగా కోతులు, మనుషులకు సోకుతుంది. కోతుల నుంచి ఈ వైరస్ మనుషులకు సోకుతుందని అధికారులు చెబుతున్నారు. అందుకే కుడిగె గ్రామ పరిసర అడవుల్లో ఎక్కడ కోతి చనిపించినట్టు కనిపించినా తమకు సమాచారం అందించాలని గ్రామస్తులను కోరారు. ఈ వైరస్ తొలిసారిగా సొరబ తాలూకాలోని క్యాసనూరు గ్రామంలో 1957లో రిపోర్ట్ అయింది. అప్పటి నుంచి ఈ వైరస్ చాలా ఉత్పరివర్తనాలు (మ్యూటేషన్లు) చెందినట్టు అధికారులు వివరించారు.

గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,37,704 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే కిందటి రోజుతో పోలిస్తే కొత్త కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అయితే వరుసగా మూడో రోజు కూడా దేశంలో 3 లక్షలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి.తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,89,03,731కి చేరింది. మరోవైపు వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ వేరియంట్ మొత్తం కేసుల సంఖ్య పదివేలు దాటేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం బులిటెన్ విడుదల చేసింది. తాజాగా కరోనాతో 488తో మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 4,88,884కి చేరింది. గత 24 గంటల్లో 2,42,676 కరోనాను జయించారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 3,63,01,482కి చేరింది. ప్రస్తుతం దేశంలో 21,13,365 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి.

click me!