
పంజాబ్ రాష్ట్ర భద్రతకు ఆప్ ప్రభుత్వం హానికరం అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి జైవీర్ షెర్గిల్ ఆరోపించారు. సోమవారం మొహాలీలోని పంజాబ్ పోలీసుల ఇంటెలిజెన్స్ వింగ్ ప్రధాన కార్యాలయంలో పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంల ఆయన ఆప్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. పంజాబ్ ప్రభుత్వానికి ఈ ఘటనపై దర్యాప్తును నిర్వహించే సామర్థ్యం లేదని అన్నారు. దీంట్లో కేంద్ర ఏజెన్సీలను భాగస్వామ్యం చేయాలని ఆయన కోరారు.
జైవీర్ షెర్గిల్ మంగళవారం ట్విట్టర్ వేధికగా ఆప్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘ ఆప్ ప్రభుత్వానికి ఈ విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలను నిమగ్నం చేయాలని నేను కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కోరుతున్నాను. ఎందుకంటే ఆప్ ప్రభుత్వానికి అలా వ్యవహరించే సామర్థ్యం లేదు. లేదా దానికి సరైన ఉద్దేశ్యం లేదు. పంజాబ్ లోని ఆప్ ప్రభుత్వం రాష్ట్ర భద్రతకు హానికరం’’ అని తెలిపారు. ‘‘ భగవంత్ మాన్ పంజాబ్ ముఖ్యమంత్రి కంటే కేజ్రీవాల్ ప్రచార మంత్రిలాగానే నటించడం మొదలు పెట్టారు. మొహాలీలోని పోలీసు కార్యాలయంపై దాడి అధికార యంత్రాంగానికి హెచ్చరికగా ఉండాలి’’ అంటూ షెర్గిల్ ట్వీట్ చేశారు.
ఈ దాడికి సంబంధించి పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మంగళవారం ట్వీట్ చేస్తూ ‘‘ మొహాలీలో జరిగిన పేలుడుపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మన పంజాబ్ వాతావరణాన్ని పాడుచేయడానికి ఎవరు ప్రయత్నించినా వారిని వదిలిపెట్టరు.’’ సోమవారం సాయంత్రం ఇంటెలిజెన్స్ విభాగం ప్రధాన కార్యాలయంలోని మూడో అంతస్తును లక్ష్యంగా చేసుకుని రాకెట్ లాంచర్‌తో దాడి జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి నష్టం జరగలేదు. అయితే ఈ దాడి ఉగ్రవాదులు చేశారా లేక కార్యాలయంలోని పేలుడు పదార్థాల వలన జరిగిందా అనే విషయాలన్ని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే పేలుడు సంభవించిన సమయం నుంచి ఆ ప్రాంతాన్ని మొత్తం హై అలెర్ట్ లో ఉంచారు. ఈ దాడి విషయంలో ఓ అధికారి మీడియాతో మాట్లాడారు.
‘‘ఈ దాడికి ముందు ఇద్దరు వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. అనంతరం గుర్తు తెలియని వ్యక్తులు ఆర్పీజీని దూరం నుంచి కాల్పులు జరిపారు. ఘటనా స్థలంలో స్విఫ్ట్ కారును గుర్తించాం.’’ అని తెలిపింది. అయితే ఇంటెలిజెన్స్ వింగ్ ప్రధాన కార్యాలయంలో ఉన్న ఆర్గనైజ్డ్ క్రైమ్ కంట్రోల్ యూనిట్ ఉన్నత స్థాయి అధికారులకు హాని కలిగించడానికి ఈ దాడి జరిగిందని ఐఎఎన్ఎస్ తెలిపింది.
కాగా ఈ పేలుడు ఘటనపై పంజాబ్ మాజీ సీఎం కెప్టెన్ అమరీందర్ స్పందించారు. ‘‘మొహాలీలోని పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార్టర్స్‌లో జరిగిన పేలుడు గురించి విని షాక్ అయ్యాను. అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. మన పోలీసులపై ఈ సిగ్గులేని దాడి చాలా ఆందోళన కలిగిస్తోంది. నేరస్తులను వీలైనంత త్వరగా తెరపైకి తీసుకురావాలని సీఎం భగవంత్ మాన్‌ని కోరుతున్నాను’’ అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా ఆదివారం పంజాబ్ రాష్ట్ర పోలీసులు సుమారు 1.5 కిలోల ఆర్‌డీఎక్స్‌తో నిండిన పేలుడు పరికరాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో తర్న్ తరణ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ కేసులో ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు.