
న్యూఢిల్లీ: రాష్ట్రీయ జనతా దళ్ ప్రెసిడెంట్, బిహార్ మాజీ సీఎం లాలు ప్రసాద్ యాదవ్.. ప్రధాని మోడీపై సంచలన ఆరోపణలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోనున్నామనే ఆందోళనలో ఉన్నారని, అందుకే విదేశాల్లో ఆశ్రయాల కోసం వెతుకులాటలో ఉన్నారని పేర్కొన్నారు.
విపక్ష పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ కూటమిపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విమర్శలు సంధించారు. ఈస్టిండియా కంపెనీలో, ముజాహిదీన్ ఇండియాలోనూ ఇండియా అనే పదం ఉన్నదని పేర్కొన్నారు. క్విట్ ఇండియా అనే కామెంట్ కూడా వాటిని ఉద్దేశించి ప్రధాని చేశారు. అవినీతి, బంధుప్రీతి, సంతుష్టివాద రాజకీయాలు చేసే కొత్త కూటమి ‘ఇండియా’ ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించాల్సిందిగా ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్‌ను కోరగా.. ఆయన ప్రధాని మోడీపై ఛమత్కారంగా మాట్లాడారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంలో మోడీ ఉన్నారని లాలు యాదవ్ పేర్కొన్నారు. ‘ప్రధాని మోడీనే ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్లాన్‌లు వేసుకుంటున్నారు. ఆయన అనేక దేశాలు తిరగడం వెనుక కారణం ఇదే. ఆయనకు అనుకూలించే, పిజ్జాలు మోమోలతో ఎంజాయ్ చేసే ఏరియా కోసం ఆయన వెతుకుతున్నారు’ అని లాలు ప్రసాద్ యాదవ్ అన్నారు.
Also Read: తాజా సర్వే: ఏపీలో జగన్ కు లాస్, తెలంగాణలో కాంగ్రెస్ పై బీజేపీ ఆధిక్యం
లాలు ప్రసాద్ యాదవ్ కామెంట్‌తో వెంటనే నవ్వులు విరిసాయి. గంభీరమైన వాతావరణంలోనూ కామెడీ కామెంట్లతో తేలిక పరిచే సామర్థ్యానికి లాలు ప్రసాద్‌కు మంచి పేరు ఉన్నది. తాజాగా, ఆయన కొడుకు, బిహార్ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో లాలు ప్రసాద్ యాదవ్ పాల్గొన్నారు. అనారోగ్య కారణాలతో ఆయన ఎక్కువగా బయట కనిపించడం లేదు.