టీఎంసీ- బీజేపీ హోరాహోరీ: నేతాజీ చుట్టూ బెంగాల్ రాజకీయం

By Siva KodatiFirst Published Jan 23, 2021, 4:32 PM IST
Highlights

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలన్నీ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చుట్టూ తిరుగుతున్నాయి

అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో పశ్చిమ బెంగాల్ రాజకీయాలన్నీ ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ చుట్టూ తిరుగుతున్నాయి. నేతాజీ వారసత్వం కోసం తృణమూల్ కాంగ్రెస్, బీజేపీలు పోటీపడుతున్నాయి.

ఉదయం మమతా బెనర్జీ భారీ ర్యాలీ చేపట్టా... కేంద్రం నేతాజీ జయంతిని పరాక్రమ్ దివస్‌గా ప్రకటించింది. దీంతో పరాక్రమ్ దివస్‌లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోడీ కోల్‌కతాకు చేరుకున్నారు.

నేతాజీ భవన్‌కు చేరుకుని అక్కడి ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. ఎన్నికలకు ముందు మోడీ పర్యటన ఆసక్తిని రేకెత్తిస్తోంది. నేతాజీ జయంతి సందర్భంగా ఆయన స్మారక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయనున్నారు ప్రధాని మోడీ.

మరోవైపు పరాక్రమ్ దివస్ సందర్భంగా ప్రధాని నరేంద్రమోడీ, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఒకే వేదికను పంచుకోబోతున్నారు. మరోవైపు నేతాజీ జయంతిని రవీంద్రనాథ్ ఠాగూర్‌తో ముడిపెట్టి దేశ్ నాయక్ దివస్ పేరుతో పలు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మమతా బెనర్జీ.

మోడీ పశ్చిమ బెంగాల్‌లో అడుగుపెట్టేందుకు ముందే కోల్‌కతాలో భారీ ర్యాలీ నిర్వహించారు ముఖ్యమంత్రి మమత. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నేతాజీ జయంతికి పరాక్రమ్ దివస్‌గా ఎందుకు పేరు పెట్టారో తనకు అర్థం కావడం లేదన్నారామె.

నేతాజీ దేశ ప్రేమికుడని తనకు తెలుసునన్నారు. బోస్‌ని రవీంద్రనాథ్ ఠాగూర్ దేశ్ నాయక్ అని సంబోధించారని ఆమె గుర్తు చేశారు. ఠాగూర్ రాసిన పాటకు నేతాజీ జాతీయ గీతం హోదా ఇచ్చారని తెలిపారు మమత.

తాము ఎన్నికలకు ముందు వచ్చేవాళ్లం కాదని, నేతాజీ కుటుంబంతో ఎప్పుడూ కలిసేవున్నామన్నారు. త్వరలోనే నేతాజీ పేరుతో యూనివర్సిటీ తెరుస్తామని ప్రకటించారు సీఎం.

దీనికి ప్రభుత్వమే పూర్తిగా నిధులు సమకూరుస్తుందని.. విదేశీ యూనివర్సీటీలతో టై అప్ పెట్టుకుని పనిచేస్తుందని ఆమె చెప్పారు. నేతాజీకి ఇప్పటి దాకా స్మారకం ఎందుకు కట్టలేదన్న మమత... ఆయన జయంతిని నేషనల్ హాలీడేగా ఎందుకు ప్రకటించరని ప్రశ్నించారు.  

click me!