
PM Modi in US: అధ్యక్షుడు జో బైడెన్, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఆహ్వానం మేరకు మంగళవారం రాత్రి (భారత కాలమానం ప్రకారం) అమెరికా చేరుకున్న ప్రధాని మోడీ 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో చారిత్రాత్మక కార్యక్రమానికి నేతృత్వం వహించారు. ప్రధానితో పాటు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 77వ సెషన్ అధ్యక్షుడు కసాబా కొరిసి, డిప్యూటీ సెక్రటరీ జనరల్ అమీనా మహమ్మద్, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ ఆడమ్స్ ఉన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ఐరాస అధికారులు, దౌత్యవేత్తలు, ప్రముఖులు పాల్గొన్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ యోగా డే కార్యక్రమం గిన్నిస్ రికార్డు సృష్టించింది. న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన యోగా దినోత్సవ కార్యక్రమంలో అత్యధిక దేశాలకు చెందిన పౌరులు పాల్గొన్నందుకు గిన్నిస్ రికార్డు సృష్టించారు.
కాగా, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో జరుగుతున్న యోగా దినోత్సవ కార్యక్రమంలో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ భారత ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి పాల్గొన్నారు. ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వేదిక నుండి వస్తున్న ఫోటోలలో, రిచర్డ్ ప్రధాని మోడీని అభినందించడం, కౌగిలించుకోవడం కనిపించింది. వైరల్ అవుతున్న ఒక ఫోటోలో, రిచర్డ్ భారత ప్రధానిని కౌగిలించుకున్నప్పుడు పెద్దగా నవ్వుతూ కనిపించాడు. ఓ వీడియోలో రిచర్డ్ కూడా ప్రధాని మోడీని గురించి మాట్లాడుతూ ప్రశంసించారు. విశ్వ సౌభ్రాతృత్వం, సోదరభావం అనే ప్రధాని మోడీ సందేశాన్ని పదేపదే పునరావృతం చేయాలన్నారు. 'ఇదొక చక్కని సందేశం. ఆయన (ప్రధాని మోడీ) భారతీయ సంస్కృతి ఉత్పత్తి..భారతీయ సంస్కృతి వంటి సువిశాల ప్రదేశం నుండి వచ్చారు. విశ్వమానవ సౌభ్రాతృత్వం, సోదరభావం అనే సందేశాన్ని మనం పదేపదే వినాలనుకుంటున్నాం' అని ఈ సందర్భంగా ఆయన మీడియాతో అన్నారు.