మోదీ, పుతిన్‌ కారులో షికారు: ప్రధాని రష్యా పర్యటన విశేషాలివే

By Galam Venkata Rao  |  First Published Jul 9, 2024, 11:54 AM IST

ప్రధాని నరేంద్ర మోదీని పుతిన్‌ స్వయంగా తన ఎలక్ట్రిక్‌ కారులో ఎక్కించుకున్నారు. తన నివాసం చుట్టూ తిప్పి చూపించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.


భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రష్యాలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మాస్కో చేరుకున్న మోదీ.. అక్కడ ఘన స్వాగతం లభించింది. ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌.. మోదీ వెంటే ఉంటూ ఆతిథ్యం అందిస్తున్నారు. మాస్కోలో దిగిన వెంటనే సాదర స్వాగతం అందుకున్న మోదీ.. సోషల్‌ మీడియా వేదికపై స్పందించారు. మాస్కోలో చిరస్మరణీయ స్వాగతం లభించిందని, భారతీయ సమాజం ఆప్యాయతకు ధన్యవాదాలు తెలిపారు. భారత్‌- రష్యా మధ్య ప్రత్యేక, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఎదురు చూస్తున్నట్లు తెలిపారు. ప్రధానంగా భవిష్యత్ సహకార రంగాల్లో ఇరు దేశాల మధ్య బలమైన సంబంధాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ఆకాంక్షించారు. 

Latest Videos

సోమవారం మాస్కోలో బస చేసిన మోదీకి నోవో-ఒగారియోవోలోని రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారిక నివాసంలో ఆతిథ్యమిచ్చారు. అనంతరం మోదీని తన ఇంటికి ఆహ్వానించిన పుతిన్‌... టెరస్‌పై కూర్చొని టీ తాగుతూ పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా పుతిన్‌కు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ చర్చలు భారత్‌- రష్యా మధ్య స్నేహ బంధాలను మరింత సుస్థిరం చేస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 


  
ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీని పుతిన్‌ స్వయంగా తన ఎలక్ట్రిక్‌ కారులో ఎక్కించుకున్నారు. తన నివాసం చుట్టూ తిప్పి చూపించారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ వీడియోలో రష్యా అధ్యక్షుడు పుతిన్ డ్రైవర్ సీటులో కూర్చుని ఉండగా... ప్రధాని మోదీ పక్కన కూర్చున్నారు. ఇద్దరు నేతలూ రైడ్‌ను ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ సమయంలో వ్యాఖ్యాతల ద్వారా మాట్లాడుకున్నారు. అయితే, కారు దిగి కొద్దిదూరం తోటలో నడుస్తున్నప్పుడు ఇరువురు నేతలూ నేరుగా మాట్లాడుకున్నారు. 

మోదీ ప్రియమైన స్నేహితుడు: పుతిన్

కాగా, రెండు రోజుల రష్యా పర్యటన కోసం ప్రధాని మోదీ మాస్కో వెళ్లారు. అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధాని మోదీకి ప్రైవేట్ విందును ఏర్పాటు చేశారు. వేదిక వద్ద ప్రధాని మోదీకి పుతిన్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీని డియర్ ఫ్రెండ్ అంటూ పుతిన్ ప్రశంసించారు. తన ‘‘ప్రియమైన స్నేహితుడిని’’ చూడటం ఆనందంగా ఉందని ఒక ప్రకటనలో తెలిపారు. ముందుగా.. భారత్‌కు మూడోసారి ప్రధానమంత్రిగా ఎన్నికైనందుకు మోదీకి అభినందనలు తెలిపారు. ఇది యాదృచ్ఛికం కాదని, చాలా సంవత్సరాలు ప్రభుత్వ అధినేతగా చేసిన కృషికి ఫలితమని కొనియాడారు. ‘‘మీకు స్వంత ఆలోచనలు ఉన్నాయి. మీరు చాలా శక్తివంతమైన వ్యక్తి... భారతదేశం, భారతీయుల ప్రయోజనాలను సాధిస్తారు’’ అని పేర్కొన్నారు. మోదీ జీవితమంతా ప్రజా సేవకు అంకితం చేశారంటూ ప్రశంసలతో ముంచెత్తారు పుతిన్. ఈ సందర్భంగా స్పందించిన మోదీ... మాతృభూమికి మరోసారి సేవ చేయడానికి భారత ప్రజలు తనకు అవకాశమిచ్చారని తెలిపారు. కాగా, ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ అవతరించిందని పుతిన్ చెప్పినట్లు రష్యా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టాస్ వార్తా సంస్థ పేర్కొంది.

 

Watch: Russian President Putin drives Indian PM Modi in his electric car around his residence pic.twitter.com/7dMcau8XZb

— Sidhant Sibal (@sidhant)

భారత్-రష్యా ద్వైపాక్షిక సంబంధాలతో పాటు అన్ని అంశాలను చర్చించడానికి ఇరుదేశాల అధినేతలు మోదీ-పుతిన్‌ సమావేశమయ్యారు. ఈ చర్చల ద్వారా వాణిజ్యం, ఇంధనం, రక్షణ తదితర రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకొనే అవకాశాలను అన్వేషించనున్నారు. 

click me!