
మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీపై ప్రముఖ హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ ప్రశంసలు కురిపించారు. మోడీ భారతీయ సంస్కృతికి ప్రతీక అని అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఆవరణలో బుధవారం భారీ స్థాయిలో యోగాసనాల కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఇందులో పలువురు ప్రముఖులతో పాటు రిచర్డ్ గేర్ కూడా పాల్గొన్నారు. ప్రధాని పక్కనే యోగా చేశారు.
‘‘ఇదొక చక్కని సందేశం. ఆయన (ప్రధాని మోడీ) భారతీయ సంస్కృతి ఉత్పత్తి, భారతీయ సంస్కృతి మాదిరిగానే సువిశాల ప్రదేశం నుండి వచ్చారు. విశ్వమానవ సౌభ్రాతృత్వం, సోదరభావం అనే సందేశాన్ని మనం పదేపదే వినాలనుకుంటున్నాం’’ అని రిచర్డ్ గేర్ వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’తో అన్నారు.
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా సెషన్ కోసం మోడీతో పాటు వచ్చిన ప్రముఖులలో ప్రస్తుతం 77 వ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా పనిచేస్తున్న హంగేరియన్ దౌత్యవేత్త కసాబా కొరోసి, ఐక్యరాజ్యసమితి డిప్యూటీ సెక్రటరీ జనరల్, యూఎన్ వో సుస్థిర అభివృద్ధి గ్రూప్ చైర్ పర్సన్ అమీనా జె మొహమ్మద్ ఉన్నారు. ప్రధానికి పక్కనే కూర్చున్న హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ టిబెట్ లో మానవ హక్కుల కోసం పోరాడే న్యాయవాది, అమెరికాలోని టిబెట్ హౌస్ సహ వ్యవస్థాపకుడు, ఇంటర్నేషనల్ క్యాంపెయిన్ ఫర్ టిబెట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ చైర్మన్ గా కూడా ఉన్నారు. మొత్తంగా 140 దేశాల ప్రతినిధులు ఈ యోగా సెషన్ లో పాల్గొన్నారు. దీంతో ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు ఎక్కింది.
కాగా.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ తో ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు, ప్రభుత్వ విందులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ గురువారం వాషింగ్టన్ డీసీ చేరుకున్నారు. ఫ్రీడం ప్లాజా వద్ద ప్రధాని మోడీకి స్వాగతం పలికేందుకు భారత కమ్యూనిటీ సభ్యులు పూల వర్షం కురిపించడంతో పాటు ప్రధాని బస చేసే వాషింగ్టన్ డీసీలోని హోటల్ వెలుపల 'గార్బా', ఇతర జానపద నృత్యాలతో సహా కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు.
‘వాషింగ్టన్ డీసీకి చేరుకున్నారు. భారతీయ సమాజం ఆప్యాయత, ఇంద్ర దేవత ఆశీస్సులు ఈ రాకను మరింత ప్రత్యేకం చేశాయి’’ అని ప్రధాని ట్వీట్ చేశారు. కాగా.. ఈ పర్యటనలో భాగంగా వర్జీనియాలోని నేషనల్ సైన్స్ ఫౌండేషన్ లో ప్రధాని మోడీ, ప్రథమ మహిళ జిల్ బైడెన్ ఇరు దేశాల ఆర్థిక వ్యవస్థలకు కీలకమైన పరిశ్రమల్లో విజయం సాధించడానికి నైపుణ్యాలను నేర్చుకుంటున్న అమెరికా, భారత్ కు చెందిన విద్యార్థులతో సమావేశమయ్యారు.