
Pegasus spyware: గతేడాది దేశంలో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన పెగాసస్ స్పైవేర్ (Israeli spyware Pegasus)వ్యవహారం మళ్లీ తెరమీదకు వచ్చింది. పెగాసస్ తాము ఎవరీ మీద నిఘా పెట్టలేదనీ, దానిని కొనుగోలు చేయలేదని ఇదివరకే ప్రభుత్వం పేర్కొంది. దేశంలోని ప్రతిపక్ష నేతలు, జర్నలిస్టులు, సమాజిక కార్యకర్తలు కోర్టును ఆశ్రయించడంతో దీనిపై సుప్రీంకోర్టు కమిటీ దర్యాప్తు చేస్తోంది. అయితే, ఇజ్రాయిల్‌తో కుదిరిన రక్షణ ఒప్పందంలో భాగంగా పెగాసస్ సాఫ్ట్‌వేర్ (Israeli spyware Pegasus)ను భారత్ కొనుగోలు చేసిందని న్యూయార్క్ టైమ్స్ పత్రిక పేర్కొనడంతో.. కాంగ్రెస్ నేతలు ప్రధాని మోడీ పై మళ్లీ విమర్శలు చేస్తున్నారు. అక్రమరీతిలో స్పైవేర్ ను ఉపయోగించి పౌరులపై నిఘా పెట్టడం దేశ ద్రోహమే అవుతుందనీ, చట్టానికి అతీతులు ఎవరకూ కాదనీ ఘాటు వ్యాఖ్యాలు చేసింది కాంగ్రెస్.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇజ్రాయెల్‌తో ఒప్పందంలో భాగంగా 2017లో పెగాసస్ స్పైవేర్ (Israeli spyware Pegasus)ను మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కొనుగోలు చేసిందనీ, మోడీ సర్కారు దేశద్రోహానికి పాల్పడిందంటూ ఘాటు వ్యాఖ్యాలు చేశారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం మన ప్రజాస్వామ్యం, నాయకులు, ప్రజలు, సంస్థలపై నిఘా పెట్టడానికి పెగాసస్‌ను కొనుగోలు చేసిందని ఆరోపించారు. అక్రమ రీతిలో దేశ పౌరులపై నిఘా పెట్టడం ముమ్మాటికి దేశ ద్రోహమేనని రాహుల్ గాంధీ (Rahul Gandhi) అన్నారు.
"మోడీ ప్రభుత్వం మన ప్రాథమిక ప్రజాస్వామ్య సంస్థలు, రాజకీయ నాయకులు, ప్రజలపై గూఢచర్యం చేయడానికి ఇజ్రాయిల్ సంస్థ ఎన్ఎస్‌వో గ్రూప్ తయారు చేసిన పెగాసస్ స్పైవేర్ ను కొనుగోలు చేసింది. ప్రభుత్వ అధికారులు, ప్రతిపక్ష నాయకులు, సాయుధ బలగాలు, న్యాయవ్యవస్థ అందరూ ఈ ఫోన్ ట్యాపింగ్‌ల ద్వారా లక్ష్యంగా చేయబడ్డారు. ఇది దేశద్రోహం. మోడీ ప్రభుత్వం దేశద్రోహానికి పాల్పడింది" అని రాహుల్ గాంధీ (Rahul Gandhi) ట్వీట్ చేశారు.
కాగా, న్యూయార్క్ టైమ్స్ (The New York Times) లోని నివేదిక ప్రకారం.. ఇజ్రాయిల్-భారత్ ల మధ్య 2017లో రక్షణ ఒప్పందం జరిగింది. దాదాపు USD 2-బిలియన్ల అధునాతన ఆయుధాలు, ఇంటెలిజెన్స్ గేర్‌ల సంబంధించిన ఈ ఒప్పందలో భాగంగానే పెగాసస్ స్పైవేర్ (Israeli spyware Pegasus)ను భారత్ కొనుగోలు చేసిందని పేర్కొంది.
ఇజ్రాయిల్ కు చెందిన ఎన్ఎస్‌వో గ్రూప్ తయారు చేసిన పెగాసస్ స్పై వేర్ ను ఉపయోగించి దేశ పౌరులపై నిఘా పెట్టడం.. అది కూడా అక్రమరీతిలో ఉండటం దేశద్రోహమే అవుతుందని కాంగ్రెస్ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యులు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రధాని మోడీ సర్కార్ ఎందుకు శత్రువులా వ్యహరించిందనీ, దేశ పౌరుల మీదే యుద్ధ ఆయుధాన్ని ఎందుకు వాడింది? అంటూ ఆయన ప్రశ్నించారు. పెగాసస్ స్పై సాఫ్ట్‌వేర్‌తో అక్రమంగా నిఘా పెట్టడం దేశద్రోహం అవుతుందనీ, చట్టం కన్నా ఎవరూ గొప్ప కాదు అని, ఈ కేసులో న్యాయం జరిగే వరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.