
న్యూఢిల్లీ: పశువులను దొంగిలించే ప్రయత్నం చేశాడని ఓ వ్యక్తిని మూక దాడి చేసి చంపేసింది. జార్ఖండ్‌లోని గిరిదిహ్ జిల్లా సది గవారో గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడిని వినోద్ చౌదరీగా గుర్తించారు. అతనిపై చోరీ సహా ఇతర నేరపూరితమైన కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.
పోలీసుల వివరాల ప్రకారం, జార్ఖండ్‌లోని హజరీబాగ్ జిల్లా సబ్‌డివిజన్ కాటందాగ్‌లోని సిమారియా గ్రామస్తుడు వినోద్ చౌదరి. డిసెంబర్ 31వ తేదీన రాత్రిపూట సది గవారో గ్రామానికి చెందిన బీరాలాల్ తుడు ఇంటిలో వినోద్ చౌదరి చొరబడ్డాడు. వారంతా అప్పుడు పడుకున్నాడు. బీరాలాల్ తుడు తన ఇంటి పరిసరాల్లోనే మేకలను, ఆవులను కట్టి ఉంచాడు. వారంతా పడుకుని నిశ్చయించుకుని వినోద్ చౌదరి బీరాలాల్ తుడు ఇంటి ప్రాంగణంలోకి చొరబడ్డాడు. కట్టేసిన పశువులను విడిచాడు. ఈ క్రమంలో పశువులు అరవడం మొదలు పెట్టాయి.
ఈ పశువుల చప్పుడు విని బీరాలాల్ తుడూ నిద్ర లేచాడు. లేవగానే అతను కేకలు వేశాడు. బీరాలాల్ తన కుటుంబ సభ్యులతోపాటు ఇంటి నుంచి బయటకు రావడానికి ప్రయత్నించాడు. కానీ, అతని ఇంటికి బయటి నుంచి తాళం వేసి ఉన్నది. చివరకు ఆ ద్వారం పగులగొట్టి బయటకు వచ్చారు. బాణం విల్లు పట్టుకుని బయటకు వచ్చాడు. ఆ తర్వాత బీరాలాల్, వినోద్ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
Also Read: కూతురి వీడియో తీసి పోస్టు చేయడాన్ని వ్యతిరేకించిన జవాన్‌పై మూకదాడి.. సైనికుడి మృతి.. గుజరాత్‌లో ఘటన
వీరు దాడి చేసుకుంటుండగా అరుపులు, కేకలు వేయడంతో ఇతర గ్రామస్తులు నిద్ర లేచి స్పాట్‌కు వచ్చారు. గ్రామస్తులు బీరాలాల్ ఇంటికి వస్తుండగా వినోద్ చౌదరి బీరాలాల్ చేతుల నుంచి పట్టువిడిపించుకున్నాడు. అక్కడి నుంచి పరారు కావడానికి ప్రయత్నించాడు. కానీ, అప్పటికే గ్రామస్తులు పలువురు అక్కడికి చేరుకోవడంతో అందరు కలిసి వినోద్ చౌదరిపై దాడి చేశారు. ఈ మూక దాడిలో వినోద్ చౌదరి తీవ్ర గాయాలపాలయ్యాడు. ఆ గాయాలతోనే చివరకు ప్రాణాలు వదిలాడు.
ఈ విషయం తెలియగానే సబ్ డివిజనల్ పోలీసు అధికారి అనిల్ కుమార్ సింగ్, ముఫసిల్ పోలీసు స్టేషన్ ఇంచార్జీ వినయ్ కుమారర్ రామ్ సదల్‌బల్‌లు స్పాట్‌కు చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలు పెట్టారు.