మధ్యప్రదేశ్‌లోని గిరిజన జాతరలో దారుణం చోటుచేసుకుంది. పట్టపగలు నడిరోడ్డుపై ఓ మూక ఇద్దరు అమ్మాయిలపట్ల అసభ్యంగా ప్రవర్తించింది. ఒకరి తర్వాత ఒకరు అన్నట్టు వారిని వేధించింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.
భోపాల్: అది ఓ గిరిజన జాతర. చాలా మంది ప్రజలు రోడ్డుపై అటూ ఇటూ నడుస్తూ ఉన్నారు. కేకలు, చప్పుళ్లతో ఆ జాతర అంతా హడావిడిగా ఉన్నది. ఒక మూక అల్లరి చేష్టలు చేస్తూ ముందుకు సాగుతున్నది. వారి రాకను చూస్తూ ఇద్దరు అమ్మాయి రోడ్డు పక్కనే బిక్కు బిక్కు మంటూ వాహనం దగ్గర మెల్లగా నడుస్తున్నారు. వారి భయాలను నిజం చేస్తూ ఆ మూకలో నుంచి ఓ యువకుడి ఒక అమ్మాయిపైకి వెళ్లాడు. ఆమెను బలవంతంగా తనవైపు లాక్కున్నాడు. ఆ తర్వాత ఆమెను ఆ మూక వైపు లాగి అసభ్యకరంగా ప్రవర్తించాడు. అదే వాహనం దగ్గర నిలబడి ఉన్న మరో అమ్మాయినీ ఇంకొకరు లైంగికంగా వేధించాడు. పట్టపగలు జరిగిన ఈ అరాచకాన్ని కొందరు వీడియో తీశారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని అలిరాజ్‌పూర్ జిల్లా సోండ్వా తెహసీల్‌లోని వాల్పూర్ గ్రామంలో మార్చి 11వ తేదీన చోటుచేసుకుంది.
హోలీకి ముందర అలిరాజ్‌పూర్, ఝాబువా, దర్, బర్వాని, సహా పశ్చిమ మధ్యప్రదేశ్‌లో గిరిజనుల జాతర భగోరియా జరుగుతుంది. ముఖ్యంగా గిరిజన ప్రజల ప్రాబల్య ప్రాంతంలో ఈ జాతరకు విశేష ఆదరణ ఉన్నది. ఎప్పట్లాగే అలిరాజ్‌పూర్ జిల్లాలోనూ ఈ జాతర జరుగుతున్నది. ఈ జాతరలో మార్చి 11న ఓ అభ్యంతరకర ఘటన చోటుచేసుకుంది.
జాతరకు వచ్చిన ఓ మూక అల్లరి చేస్తూ దుస్సహ రీతిలో ముందుకు వెళ్తున్నది. అక్కడే ఓ ఇద్దరు అమ్మాయిలు రోడ్డు పక్కన భయంతో వణుకుతు కనిపించారు. అంతే.. ఆ మూకలోని ఓ దుండగుడు అమ్మాయి వైపు పరుగెత్తి తన వైపు లాక్కున్నాడు. ఆ అమ్మాయి వెంటనే అరుపులు వేసింది. అదే రోడ్డుపై నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి ఆ యువకుడిని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లిపోయాడు. అయినా వదలకుండా ఆ యువకుడు మళ్లీ ఆ అమ్మాయి వద్దకు వచ్చి మరింత దూకుడుగా, దురుసుగా ప్రవర్తించాడు. మరింత రెచ్చిపోయి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. ఆమెను ఆ మూక వైపు లాక్కెళ్లాడు. ఆ మూకలోని వారూ ఒకరి తర్వాత ఒకరు అన్నట్టుగా ఆమెపట్ల దురుసుగా ప్రవర్తించారు. లైంగికంగా వేధించారు.
అక్కడే ఆమె వెనుకాల మరో అమ్మాయిపైనా మరో యువకుడు కూడా ఇలాగే అటాక్ చేశాడు. ఇదంతా పట్టపగలు నడి రోడ్డుపై జరిగిన ఘటన. ఈ ఘటనను చూస్తూ అక్కడున్న వారు ఆపడానికి ప్రయత్నించకపోగా.. తమ సెల్‌ఫోన్‌లలో ఘటనను రికార్డ్ చేయడం మొదలు పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది.
అయితే, ఈ ఘటనకు సంబంధించి ఎవరూ ఫిర్యాదు చేయడానికి రాలేదని అలిరాజ్‌పూర్ ఎస్పీ మనోజ్ కుమార్ సింగ్ తెలిపారు. కానీ, తామే దీనిపై స్పందిస్తూ ఎఫఐఆర్ నమోదు చేశామని, వీడియో తీసిన వ్యక్తిని గుర్తించామని వివరించారు. ఆ అమ్మాయిలపై అరాచకానికి పాల్పడ్డ వారిని వెతికి పట్టుకోవాల్సి ఉన్నదని పేర్కొన్నారు. ఈ గిరిజన జాతరకు చాలా మంది తాడి చెట్టు కల్లు తాగి వస్తారని, అది దృష్టిలో పెట్టుకునే అన్ని ఏర్పాట్లు చేశామని వివరించారు. ఈ ఘటన వెలుగులోకి రాగానే నిందితులను పట్టుకోవడానికి ప్రత్యేకంగా ఓ టీమ్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.